పుట:Himabindu by Adivi Bapiraju.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సమదర్శి మరునాడు దళపతిగా ఆంధ్ర సైన్యములలో జేరినాడు. ఒక సంవత్సరములో నాతడు ముఖపతియు, గణపతియు, వాహినీపతియు నైనాడు. మరు సంవత్సర మాతడు చమూపతియైనాడు. మొదటినుండియు ననేక యుద్ధముల వీరవిక్రముడై యాంధ్ర సైన్యములకు యశము సముపార్జించుచు నేడు విఖ్యాతినందిన ఉపసేనాపతులలో నొకడైనాడు. ఆతడు తా నెప్పుడు సేనాపతియగుదునా, ఉపసైన్యాధ్యక్షుడ నగుదునా, సర్వసైన్యాధ్యక్షుడనగుదునా, అందులకు తన మేటిమగటిమి చూపు సందర్భ మెప్పుడువచ్చునా యని ఎదురుచూచుచున్నాడు.

సమదర్శి తిన్నగా ఒకనాడు చారుగుప్తుని భవనమునకు పోయెను. తన మేనమామ కోటీశ్వరులలో కోటీశ్వరుడు. ధనము మాట యటుండ ప్రపంచమున ననన్యలభ్యమగు మహారత్నమువంటి సుందరాంగికి జనకుడు. మేనమామ కుమారిత ధర్మశాస్త్రప్రకారము తన స్వత్వము. హిమవంతుని తనయను కైలాసనాథుడు వివాహమాడినాడట. సముద్రుని పుత్రికను, సముద్రమున వసించు వటపత్రశయను దుద్వాహమయ్యెనట. చిన్న తనముననుండి తాను హిమబిందుతో ఆటలాడుకొన్నాడు. ఆమె “నాకిదికావలె” నని యనినంత తా నది తెచ్చినాడు. ఒకసారి యామె కృష్ణానది కావలియొడ్డుననున్న పచ్చ తురాయి పూలగుత్తులు పట్టుకొని రమ్మని నప్పుడు, తాను పదునారేండ్ల యీడువాడై యున్నప్పుడు, కృష్ణానది నీది ఆపూలు తెచ్చి యిచ్చినాడు. హిమబిందు తన్నెంతో మెచ్చుకొని “బావా! నీయంత గొప్పవా రెవరునులేరు నేను నిన్నే వివాహమాడెద “నని తన మెడచుట్టును బాహులతల పెనవేయలేదా? ఆనాటి కౌగిలింత యిప్పటికిని మధురస్మృతియై మరపునకురాదు. తాను బాహుబలమున అసమానుడు. తనవంశము అనేక తరములనుండియు ప్రసిద్ధికెక్కిన శాతవాహనవంశము అతిరథశ్రేష్ఠుడైన ప్రియదర్శి తన తండ్రి. తాను సేనాపతి. నేట రేపట ఉపసేనాధ్యక్షపదము, సర్వసేనాధిపత్యము, ఆ వెనుక?

ఈ ఆలోచనలు కన్నులకొక కాంతి నీయ, మోమున కొక విలాసముగూర, మూర్తికొక ఠీవి జేర్ప, గుఱ్ఱమును మంద మందగతుల నడుపుకొనుచు సమదర్శి శాతవాహనుడు చారుగుప్తుని సౌధము సమీపించెను. కోటవలెనున్న యా భవన ముఖ ద్వారము సమీపించగనే గుఱ్ఱముస్వారితో పోవుటకు మహాతోరణ వామ కవాటమును మాత్రమే ద్వారరక్షకులు తెరచిరి. స్వారిచేయుచునే సమదర్శి నిస్సరణము దాటి ద్వితీయ ద్వారము కడచి ప్రాంగణము జేరునప్పటికి అశ్వరక్షకులు గుఱ్ఱము కళ్ళెమును పట్టుకొన, సమదర్శి అవరోహణ మొనర్చుచు పగ్గపు త్రాడు వారికిచ్చి పాదరక్షలు చప్పుడుకా, మీసములు వడివేసికొనుచు, సభాశాల దాటి అభ్యంతర గృహములోనికి బోయెను.

అట్లు నడచి నడచి ప్రతిహారుల నమస్కృతులందుకొనుచు ఆ సౌధశాలలకు, అందున్న సమస్తమునకు ప్రభువునా విస విస నాతడు లోనికి జనెను. ఒక మందిరముకడ ఆగి, పాదరక్ష వదలి, యచ్చట నున్న పరిచారికతో తనరాక చెప్పిపుచ్చి అనుమతికై నిలిచియుండ ఆమె లోపలికిబోయి ఒక క్షణములో మరలివచ్చి “రావచ్చు” నని తెల్పెను.

సమదర్శిశాతవాహనకుమారుడు ప్రవేశించిన గృహము వైకుంఠమున లక్ష్మీదేవి నివసించు మందిరమువలె ప్రకాశించినది. బంగారముతో, దంతముతో, చందన తరువులతో నిర్మించిన పీఠములు, మంజూషలు, కాశ్మీర దేశపు కంబళ్ళు, సహ్యాద్రి పులుల, హిమవన్నగ శ్వేతచమరీమృగముల, వింధ్యాటవీ సింహముల, కామరూప

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 50 •