పుట:Himabindu by Adivi Bapiraju.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాచరించి తమతమ నామధేయములు తెలిసికొని, చక్రవర్తి యనుజ్ఞనొంద, తమతమ శకటములకడకుబోయి, వాని నారోహించి ప్రారంభస్థానమున, ముందు కురకబోవు వృషభముల నయభయముల నిలువ వారింపుచుండిరి.

రథపరీక్షామార్గము విశాల సమతలము. దారి పొడుగునను దిమ్మెస చేసి, గట్టిచేసిరి. బయలుదేరిన స్థలమునుండి శకటములు ఒక గోరుతము దూరము పోయి యచ్చట నర్ధచంద్రాకృతిని కుడివైపునకు మళ్ళి, వేరొక విశాలమార్గమునవచ్చి, ప్రారంభ స్థలమునకు పోయి, మరలనట్లే ఇంకొక పర్యాయము తిరిగి గమ్యస్థానమునకు రావలెను.

ఆంధ్రు లందరకును తమవారిలో నొక్కడు నెగ్గితీరునని దృఢనిశ్చయము. శకటములు తేలికగల తరువాతి కాండముల నిర్మించినవి. లాక్షావర్ణాలంకృతములై, భూషణానేకసుందరములై, దేవవిమానముల నవి తలపించుచున్నవి.

ప్రారంభప్రదేశమందవి శ్రేణిగా నిలువబడియున్నవి. కండరములు కట్టి, లేడికాళ్ళవలె పలుచని కాళ్ళు కలిగి, పొట్టివియు, నెత్తయినవియు, శ్వేత, కపిల, శబల, ధూమ్ర, లోహితవర్ణవిగ్రహములై కొమ్ములకు వెండి బంగారు తొడుగులు, కాళ్ళకు వెండి బంగరుగజ్జెలు, నడుములకు పట్టుదట్టీలు, మూపుల వర్ణకంబళములు, కంఠముల బంగారువెండిమువ్వలు, ఘంటికలు, మూర్గముల చర్మపుదట్టీలు, బాసికపుదండలు కలిగిన కోడెలు, గోవృషభములు, ఉక్షములు - భయమున కొన్ని, గర్వమున కొన్ని, నిశ్చలత్వమున కొన్ని, రౌద్రమున కొన్ని, తొందరపాటుతో కొన్ని నిలిచి తోకలు ఇటునటు నాడించు చున్నవి. అంకెలు వేయుచున్నవి. డెక్కలెత్తి నేలను రాయుచు, కొట్టుచున్నవి. మోరలు చూచుచున్నవి. చెవులనాడించుచున్నవి. కన్నుల త్రిప్పుచున్నవి.

ఆ శకటముల నడుమ అద్భుతదారుశిల్ప సుందరమగు రథముపై పగ్గముల సడలించి పట్టి, లీలాభంగశరీరియై, చిరునవ్వున వెల్లకోడెలతో “శైబ్య! సుగ్రీవక! ఏమది? తొందరా మీకు?” అనుచు తీయతీయని మాటలాడు బాలకుని, ఆ ప్రక్కనే శకటచోదకుడై యున్న కరూరవుడు విని, కాళింగునకు కన్నుగీటినాడు.

“తెలుగుదద్దమ్మలకు తొందర ఏల అచ్చటనే యుండవచ్చునులే” అని పాలీభాషను కాళింగుడు కరూరవుని ముఖము చూచి పలికినాడు. సమవర్తి శాతవాహన వీరశ్రేష్ఠుడు సగర్వముగ ఛంగున నురికి తనకంబళివ్యాహకమారోహించి, పగ్గములుపట్టి ఆసీనుడైనాడు. చారుగుప్తుని వదనమున సంతోష హాసరేఖ లుదయించినవి.

హిమబిందు తన మేనబావ సమవర్తిని జూచి, ఆనంద ప్రపుల్ల వదనయై “సెబా” సనుకొన్నది.

9. శకట వేగములు

ప్రేక్షకులందరు తమతమ యాసనముల పై, మొదట నిశ్చల మనస్కులై కూరుచుండిరి. తరువాత వారి హృదయముల విజయలక్ష్మీ ధవుడెవ్వడగునా యను నాలోచనలు పొడసూపినవి. ఆ వెనుక సమవర్తి నెగ్గితీరవలయునని కొందరి హృదయముల, ఆంధ్రులలో నెవ్వరైనను సరియని కొందరి మనఃపథముల, కాంక్షలు మొలకెత్తి పెరిగి మహావృక్షములైనవి. అందువల్ల మాటలు, వాదనలు, కోపములు, హర్షములు, హాస్యములు వికటహాసములు చెలరేగినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 24 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)