పుట:Himabindu by Adivi Bapiraju.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పందె మింకను ప్రారంభముకాలేదు. ప్రజల హృదయములలో విసుగు, ఆవేగము పరువులెత్తినవి. నిశ్చలాసీనత వికలమై ఆసనములలో ఇటునటు కదలువారు, వంగువారు, వెనుకకు వాలువారు, చక్రవర్తి మందిరమువైపు చూచి, ఆలస్యమునకు కారణమేమి యనుకొనువారునై యుండిరి.

అంతలో సృష్ట్యారంభమం దుద్భూతమగు శబ్దబ్రహ్మముంబోలి, ఒక్కసారి పదునారు శంఖములు “భోం, భోం, భోం, భోం!” అని ధ్వనించినవి.

ఆ ధ్వనికి భీతచిత్తములై మాళవుని ఎద్దులు, పాండ్యుని వృషభములు అడ్డగోలుగా పరుగిడినవి. శకటములు తలక్రిందులై శతశకలములైనవి. తక్కిన బండ్లన్నియు సమవేగంబున పరువిడి వచ్చుచు, పరీక్షా పథమున నడ్డముగ పడియున్న బండ్లను తప్పుకొని, చుట్టి ముందుకు సాగినవి.

భరుకచ్చపువీరుని బండిగిత్తలు పడిపోయిన బండ్లను చూచి, ముందుకు సాగక, వెనుకకుతిరిగి, విశ్రమారామములవైపునకు పరుగిడిపోవ, గొల్లుమని ప్రజలొక్కుమ్మడి లేచిరి. అంత గజదళాధికారియగు ప్రమానందుడు అచ్చటనే యుండుటచే, నేనుగుపైనుండి పాశము విసరి ఒక్కఎద్దును పడగొట్టెను. తోడనే బండి తలక్రిందై పడినది. ఏ ప్రాణికిని అపాయము రాలేదు.

పందెపుబండ్లు. పడిపోయినబండ్లను దాటిపోవగనే పలువురు సేవకులు వైద్యులు అచటకు పరువిడి, శకటశకలములను, దెబ్బలుతిన్న వృషభములను, సారధులను కొనిపోయిరి. ఆ స్థలమును తక్కినబాటతో సమముచేసి వేసిరి.

కాళింగుడగు మల్లినాధునిబండి అన్నింటికి ముందు ఛెంగు ఛెంగున పరువిడి పోవుచున్నది. అతని వెన్నంటీ వీరత్తుణితలైయాళై తనబండిని తోలుకొనుచు అరవమున నేదియేని మాటలాడుకొనుచు పోవుచున్నాడు. వీరత్తుణికి ఎడమప్రక్క కేరళ, ఘూర్జర, వంగవీరులు రథముల పరువెత్తించుచుండిరి. ఆ వెనుక లిచ్ఛవుడు, మువ్వురాంధ్ర వీరులు సమముగ బోవుచుండిరి. వారిని వెన్నంటి సమవర్తి, సువర్ణశ్రీ, మాగథుడును, వారికి కొంచెము ఎడములో పలువురును బోవుచుండిరి.

సువర్ణశ్రీ నిర్మల నీలాకాశచంద్రమూర్తివలె నిర్వికారుడై పోవుచున్నాడు.

ఎద్దులన్నియు మోరలెత్తి ఊర్పులూర్పుచు, కనుకొలుకుల కెంపులు గ్రమ్ము, చిరునురుగులు సెలవుల ప్రసరింప, పాలసముద్రతరంగమువలె, ధవళ కాదంబినీ మాలలవలె, గంగానదీపతనములవలె గంగడోళ్ళాడుచుండ మహా వాయువేగమున పరుగు వారుచుండెను. తేలికయగు శకటము లిటునటు నాడి పోవుచున్నవి. సారథులు వంగి, ఎద్దుల నదలించుచు, పసరముల ప్రార్థించుచు, కోడెలతోటి సరసంభాషణములాడుచు బోవుచుండిరి.

మొదటిసారి సగముదూరము పోవునప్పటికి లిచ్చవుని దూడలు పరుగిడలేక ఆగిపోయినవి. మొదటి చుట్టుకడకు పోవునప్పటికి కేరళ, కామరూప, గాంధారుల శకటములన్నియు వెనుకకుపోయినవి. చుట్టి, తిరిగి సగముదూరము వచ్చునప్పటికి మిగిలినవారు కళింగుడు, మాగథుడగు శివస్వాతి, సమవర్తి, సువర్ణ శ్రీకుమారుడు, ఇంక నిరువు రాంధ్రులు, సుశర్మ కాణ్వాయనుని రథము తోలు కరూరవుడు మాత్రము.

ప్రేక్షకుల ఆలోచనలు బిగుసుకుపోయినవి. ఆ మహారంగస్థల మంతట నిశ్శబ్దత ఆవహించినది.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 25 •