పుట:Himabindu by Adivi Bapiraju.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చండకేతుడు ముఖపతులతో, గణపతులతో, పదాతివీరులతో చారుగుప్తునకు ఎదురేగి, సార్వభౌమవాద్యమేళములు వణిక్సార్వభౌముని మేళములతో మేళకముగా సగౌరవముగ తోడితెచ్చి, చారుగుప్తుని మందిరముకడ విడియించుటయు, వారందరు రథావతరణ మొనర్చిరి. చారుగుప్తుడు ఇంద్రగోపుని చేయి నూతగొని రథము దిగెను. వేరొక రథమునుండి హిమబిందుకుమారియు, ముక్తావళీదేవియు, అమృతలతాదేవియు, చెలియగు బాలనాగియు, అలంకారికయగు తారాదత్తయు దిగిరి, వేరువేరు శకటముల నుండి హిమబిందు సేవకురాండ్రు పెక్కండ్రు దిగినారు. అశ్వికులు మండపమువెనుక కావలి కాయుచుండిరి. చారుగుప్తాదులు వివిధాసనముల నాసీనులైరి.

రథమునుండి అవరోహించుచు హిమబిందుకుమారి మేలిముసుగు తీసి, వివిధాలంకారులు, వివిధవర్ణ వస్త్రశోభితులు, కోలాహలపూర్ణులైన యా మహాప్రజలను కౌతుకముగ పర్యాలోకించినది.

ఆమె అందాలప్రోవు, విలాసములమూట. ఒయారములకుప్ప. ఆమె పరమాద్భుత సౌందర్యమునకు ముగ్ధులై, ప్రజలును దళ ముఖ గణచమూపతులు, రాజోద్యోగులు, మంత్రులు, దండనాయకులు, ప్రాడ్వివాకులు, ఒకరననేల అందరును ఆమెనే చూచుచుండిరి.

మహాకాండూరనగరపు బంగారు సరిగపూవుల లతల దుకూలము, పనుపుపచ్చ ఎరుపు వెలుగునీడల నేతచీర ధరించి, నీల చీనాంబర స్తన వల్కలము బిగించి, ఆమె పాము కుబుసముబోలు కాశ్మీరసువర్ణమృగీ రాంకవము వల్లెగా ధరించినది.

పదునారేండ్ల ఎలప్రాయమున పాటలవర్ణ జాంబూనదభాసురయగుచు పారిజాత కుసుమమును దలపించిన దా బాల. ఆమె నాలోకించిన యువకులు పురుషులు ఎందరు నిట్టూర్పులు వదలిరో, ఎందరి గుండియలు కొట్టుకొనెనో, ఎంద రెట్టి స్వప్నలోక విహారులైరో, ఎందరు సమ్మోహనాస్త్ర పీడితులైరో? అప్పుడు ప్రజలు సార్వభౌముడు ఇంద్రునివలె, బోధిసత్వునివలె అరుదెంచుటయే గమనింపలేకపోయిరి.

శంఖ వేణు ముఖవీణ కాహళాది సుషిరములు, భేరి ఢంకా మృదంగాది వాద్యములు, తాళములు, తప్పెటలు సముద్రఘోషాగాంధర్వము సర్వదిశల నావరింప యథోచితవేషుడై, సూర్యుని రథాశ్వములవలె కలశాంభోధీ వీచికోపమానములైన ధవళతురంగములు పూన్చిన సువర్ణరథ మారోహించి, అతిరథుడైన శ్రీముఖశాతవాహన మహారాజు మంత్రులు, సామంతులు, దండనాయకులు, కవులు, ఆచార్యశ్రమణకులు, ఉత్తమ గాయకులు, మహాశిల్పి ధర్మనంది, సర్వసేనాధ్యక్షుడు, ఉపసేనాధిపతులు కొలువ ఇంద్రవైభవముగ విచ్చేసి రాజ మందిరము ముందాగి రథావతరణ మొనర్చెను. వందిమాగధులు కైవారములు చేయుచుండిరి.

సార్వభౌముని రథము పరివార సమేతమై వచ్చుచున్నదనగనే మహాఖేలనాప్రదేశస్థులగు ప్రజలెల్లరు జయజయధ్వానములు సలుపుచు, లేచి నిలుచుండిరి.

సార్వభౌముడు సింహాసన మధిరోహించుటతోడనే బ్రాహ్మణులు, శ్రమణకులు సామ్రాట్టుకు ఆశీర్వాదము లొసంగిరి.

ఇంతలో శకటాధ్యక్షులు, మహశ్రీ సార్వభౌమునికడకు వచ్చి మోకరించి, నమస్కరించి, లేచి, ఉక్షశకటపరీక్షకు వచ్చినవారి నందరిని సార్వభౌముననుజ్ఞకై మందిర ప్రాంగణమునకు తీసికొనివచ్చెను. వారందరు సార్వభౌమునికి సాష్టాంగదండప్రణామంబు

అడివి బాపిరాజు రచనలు - 2

• 23 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)