సుందరీనందుల చరిత్ర ఏమైనది? అటులనే తామును సన్యాసము పుచ్చుకొందుము గాక! దూరమున నుండియే తాను తన స్వామిని దర్శింతును. ఆయన కొరకే తన సన్యాసము. ఆయన తన తపస్సు. ఆయన తన నిర్వాణము!
“ప్రభూ! మీరు సన్యాసులగుడు. నన్నును దీక్షపుచ్చుకొన నిండు. అంతియ నా తుదికోర్కె” అని హిమబిందు సువర్ణుని ఎదుట మోకరించి నది.
సువర్ణశ్రీ “వలదు, హిమబిందూ! అట్లనకుము. నీ పితృదేవుల కోర్కె నిరాకరింపకుము. బుద్ధదేవుడు నిన్ను రక్షించును. నీకు సన్యాస మేమి?” అని చేతులు రెండుజోడించి విచారముతో, గద్గదికతో పలికి వేదనతో నిలుచుండెను.
“సువర్ణశ్రీకుమారా! నీకు మాత్రము సన్యాస మెందుకయ్యా!” అని చారుగుప్తుడా మందిరములోనికి వచ్చెను. చారుగుప్తుని వెనుక ఆ సంఘారామ కులపతియు, వారివెనుక కీర్తిగుప్తుడును వచ్చిరి.
21. రాజప్రతినిధీ జయ!
హిమబిందు లేచి నిలుచున్నది. ఆమె భీతచిత్తయై, ధైర్యము కుదుర్చుకొని, కోపఘూర్ణయగు ఆడుపులియైనది.
చారుగుప్తుడు తనయను గట్టిగ హృదయమున కదుముకొని, “నా తల్లీ! నిన్ను సువర్ణశ్రీకి ఉద్వాహమొనరింప నేను సంపూర్ణముగ సంకల్పించుకొనినాను. నే నందులకే నీవెంట వచ్చితిని తల్లీ! అందుకే మీ తాతగారును నీ మామగారును వచ్చినారు. మేము నీ వెనుకనే ఈ మందిరముకడకు వచ్చి, గుమ్మముకడ ఆగి మీ సంభాషణ వినుచుంటిమి. సువర్ణశ్రీ! నీవు పవిత్రచరిత్రుడవు. నేను మూర్ఖుడనై ఐహికభోగములు కాంక్షించితిని. నీవు నాతల్లిని నీ ఆత్మతోడనే ప్రేమించితివి. నీవు సన్యాస మెట్లు గ్రహింపగలవు నాయనా? నీవు భిక్షుకత్వము స్వీకరించి, ధర్మమునకు ద్రోహము చేతువా?” అని సువర్ణుని వైపు తిరిగియనెను.
హిమబిందు తండ్రిమాటలకు చకితియై తండ్రికంఠము చుట్టు చేతులు వైచి, ఆతని హృదయమున తన మోము దాచుకొని, అతి సంతోషమున వెక్కివెక్కి ఏడ్చినది.
సువర్ణశ్రీ ఇది కల యనుకొన్నాడు. తన్ను తాను నమ్మలేకపోయి నాడు. చారుగుప్తుని వైపు వెఱ్ఱివానివలె చూచినాడు. కీర్తిగుప్తునివైపు చూచినాడు. ఆ వెనుక ఆచార్యుల చూచి మోము వాల్చినాడు.
“బిడ్డా! నీవు భిక్షుకుడ వెట్లగుదువు తండ్రీ! నా కా గాంధారభిక్షుకుడు వచ్చి చెప్పినప్పుడే నవ్వువచ్చినది. నీవు కాబోవు తాతగారికి, మామ గారికి నమస్కరింపుము!” అనినారు.
సువర్ణశ్రీ తెల్లబోయి ఇటునటు చూచినాడు. ఎట్లు వీరంద రిచ్చటికి వచ్చినారు? వీరు తన సంకల్పమును కొనసాగనీయరా?
హిమబిందు వచ్చినది. ఆమెతండ్రివచ్చినాడు. ఆమె తాతయు వచ్చినాడు.
చారుగుప్తుడు కొమరితపై యత్యంత ప్రేమచే యామె కోర్కెనే పాలించుటకు వచ్చినారా? లేక ఆ బాలికను తనెదుట యువరాజునకై ఒప్పించుటకా? మొదటి
అడివి బాపిరాజు రచనలు - 2
• 288 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)