Jump to content

పుట:Himabindu by Adivi Bapiraju.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆతడు కన్నులు తెరచెను. హిమబిందు కన్నుల నీరునిండ, ఆతని ఎదుట చేతులు జోడించి నిలిచియున్నది.

“స్వామీ! మీరు నన్ను నిజముగా మరచిపోవలయుననియే సంకల్పించినారా?”

ఆతడు చకితుడై తనయెదుట నున్నది హిమబిందే అని గ్రహించి లేచి నిలుచుండినాడు. ఆతడు గజగజ వణకినాడు. ఒక్కసారి పరచింత లెల్ల విడిచి ఈ దివ్యమూర్తిని తనహృదయమున కదిమికొని, మనుష్య లోకమునకు దూరముగ నామెను తస్కరించుకొనిపోయి, యావెయే తానై, ఆ నిర్జనపథములలో దివ్యానంద మనుభవింపవలయు ననుకొనినాడు.

ఒకసారి ఈబాలిక ఈ మహో తమచరిత్ర మహారాజ్ఞియై, చక్రవర్తిని లోక మేల నున్నప్పుడు, తానామెకు ధూమకేతువువలె ఆమె పాలిట దుర్దైవమువలె తటస్థించుట మహాదోషము అనుకొనును.

ఈమె ఇట్లేల వచ్చినది? అయ్యయ్యో! ఏ మనుకొందురు! ఎంత తప్పు! నాకై ఇట్లు వచ్చుట ఏమి? వృషభశకట పరీక్షలో నెగ్గుటయే ఈ యనర్థముల కన్నిటికి మూలము. తా మిద్ద రట్లు ప్రేమించుకొననేల? తథాగతుడు తన కేదారి చూపునో? ఇంతదనుక తాను భిక్షుకత్వ మేల పుచ్చుకొన లేకపోయినాడు?

“సువర్ణశ్రీకుమారా! మాటలాడ రేమి? నేమి దోష మొనర్చితి నని ఇటుల పారిపోయి వచ్చితిరి?”

“దేవీ! నీవు దోష మొనర్చుటా! నేను దోషముల ముద్దను, మా నాయనగారి మాటలు విన్నచో నా ప్రభువునకు, నాధర్మమునకు దోషము వచ్చెడిదిగాదు.”

“మీ రేమి దోష మొనరించినారు? నాదే దోషమంతయు. నా కీ విద్య లెందుకు, నా కీ జన్మ ఎందుకు? ఏల నేను మాతండ్రికి ఉద్భవించి నాను? మిమ్ము ప్రేమించితిని. మీరు నాకు భర్తలు. ఒండొకని భర్తగా ఎట్లంగీకరింపగలను? అది ఆర్యధర్మము కాదు. స్త్రీధర్మ మంతకన్నను గాదు. మీరు భిక్షుకులగుదురా, నేనును భిక్షుకురాల నగుదును. మీకు సేవ చేయుదును.”

“నీవు మహారాజ్ఞివి కావలయును! భారతవర్షమును రక్షింపవలయును. ధర్మ భావనమునకై ఉద్భవించిన నీకు భిక్షుకత్వము తగదు.”

“మీకన్న నాకితరధర్మము, దైవములేదు. కానీ నాడు నాకీ ప్రాణములు నిలువవు.”

“బుద్ధ! బుద్ధ! అట్టిమాట లనకు దేవీ!”

సువర్ణశ్రీ ఏమిచేయును? ఎదుట తాను రచించిన బోధిసత్వవిగ్రహము! కుడివైపున హిమబిందు! ఆమె బోధిసత్వునిదేవియై, యాతనికి తోచినది. కాని ఆ బోధిసత్వుడు తనపోలిక! ఆ బోధిసత్వుడే తా నయినాడు.

హిమబిందునకు ధైర్యము పటాపంచలగుచున్నది. తాను చారుగుప్తుని తనయ యై తన చిరకాంక్షితమును పొందలేకపోయినది. భిక్షురాలై సంఘసేవ చేయుచు ఈ మహాత్ముని, ఈ బోధిసత్వావతారుని, మనస్సులో పూజించుచు, నశించిపోవుటకంటె మార్గ మింకొకటి లేదని యామె తలంచి భయపడి గజగజ వణకిపోయినది. ఆమె ముడుచుకొని క్రుంగిపోయినది. తానెట్లు మరల తండ్రి ఇంటికి పోగలదు? తనకు చక్రవర్తినీత్వ మావం తయు అవసరము లేదు. తనకు కుబేర వైభవము వలదు. ఏల తాను ఒక కర్షకసుతయై జన్మింపలేదు?

అడివి బాపిరాజు రచనలు - 2

• 287 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)