విషయము నిజమైనచో తానెట్లు ఒప్పుకొనగలడు? రెండవ విషయమున హిమబిందునే ఒప్పించుటకు తాను ఆమెపాదముల బడును.
ఏది కర్తవ్యము? ఏమిటిది? తనకై ఇంతమంది వచ్చిరి. తానెప్పుడు ఇట్టి సంకటములే ఇతరులకు తీసుకొనివచ్చుచుండునా? ఏది కర్తవ్యము?
తన ప్రభువునకు తాను ద్రోహమెట్లు చేయును? ఇదే తనకు మార పరీక్ష? తథాగతుడు తన పక్షము రానేరాడా? తనలోని దోషములే తన్నీ పరీక్షకు తెచ్చినది.
ఓం నమ చ్ఛాక్యమునయే
సువర్ణశ్రీ మ్రాన్పడిపోయెను. ఆతడు కన్నులు మూసెను. ఆతడు రచించిన బోధిసత్వుడైన తానే తన ఎదుట తనకు ప్రత్యక్షమైనాడు.
కన్నులు తెరచి హిమబిందును చూచినాడు. ఆమె కన్నుల నీరు కారి పోవుచున్నది. చారుగుప్తుడు చిరునవ్వు నవ్వుచున్నాడు. కీర్తిగుప్తుడు తనపై కరుణార్ధ్రచంద్రిక లగు చూపుల పరచుచున్నాడు. సంఘారామ కులపతి భ్రూయుగ్మముమధ్య ఈ ప్రపంచమున ఇట్టి దుఃఖమయ చరిత్రలు వ్యక్తమగుట మారదేవుని మహిమయేగదా యను విచారణాత్మకము లగు కాంతులు ప్రసరించుచున్నవి.
సువర్ణశ్రీ మూర్తిమంతుడు, సుందరశ్రీలేఖా సమన్వితుడు, మనోహర కాంతియుతుడు, వీరావతంసుడు, మహాశిల్పి. సువర్ణశ్రీ కుమారుడు ఏమియు మాటలాడలేక మ్రాన్పడి నిలుచుండెను.
చారుగుప్తుడు “నీకుమాత్రము సన్యాస మెందుకయ్యా?” అని గంభీరములు, ఆర్ధ్రములు, ప్రేమమయములయిన వాక్యములు పలికిన పలుకులే ఆతనికి స్థూప ఘంటికా నిస్వనములై, వీణతీగల మ్రోతలై వినిపించినవి.
ఆ పలుకులు వినంబడి ఇరువది నిమేషములైన కాలము జరుగ లేదు. సువర్ణశ్రీ ఆ శిల్పశాలయం దుండియు చతుర్ధశభువనములు మహా వేగమున పరిభ్రమించి పోవుచున్నాడు.
ఏ భావము స్పష్టముగ దర్శనమీయదు. ఏ వెలుగును పూర్ణకాంతి యుతముకాదు. ఏ చీకటియు గాఢతమస్సు కాదు.
ఆతడు గడగడ వణంకిపోవుట కీర్తిగుప్తుడు చూచి ఆ బాలుని కడకుపోయి “నాతండ్రీ! నీవు హిమబిందును ప్రేమింపలేదా, ప్రేమించి వదలుకొంటివా?” అని అస్పష్టముగ ప్రశ్నించెను. కాని కీర్తిగుప్తుని కన్నులు నవ్వుచున్నవి.
చారుగుప్తుడు కొమరిత చుట్టును తనచేయి చుట్టి, సువర్ణశ్రీని చూచి, “కుమారా! ఈ బాలిక నీపై ప్రాణము పెట్టుకొని బ్రతికియున్నది. ఆమెపై ప్రాణ ముంచుకొని నేను బ్రతికియుంటిని-” అని అనుచుండ సంఘారామ కులపతి, “మీపై జంబూద్వీపమంతయు నాధారపడియున్నది వర్తక సార్వభౌమా!” అని యనినాడు.
సువర్ణశ్రీ ఏమి చేయవలయునో, ఏమి యనవలయునో తెలియక మౌనమూర్తియై నిలుచుండెను. ఒక్కొక లిప్త ఒక యుగమువలె జరుగు చున్నది. తన మహారాజు, హిమబిందు తాను, చారుగుప్తుడు-మహారాజు, హిమబిందు -
“జయజయ! జగన్ న్మహాపథనృత్యత్ కీర్తిసుందరీపాదా! జయ చతుస్సముద్ర ముద్రిత ధరావలయ సార్వభౌమకుమారా! సాతవాహనపవిత్ర వంశపారావార రాకాసుధాకరా!
అడివి బాపిరాజు రచనలు - 2
• 289 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)