పుట:Himabindu by Adivi Bapiraju.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్వాణం” అని గదా? దుఃఖాదులు దీనియందు నిర్గతమగునని గదా? ఎంతటి క్షుద్రాశయము!

అమృత: దుఃఖాదు లన జన్మపరంపరగదా?

స్థౌల: జన్మపరంపర నిజమయినప్పుడు నీకు నిర్వాణ మెప్పుడు వచ్చును? నీ వేమవుదువు?ఎందు గలసెదవు? నీవు వేరుగా నుందువా? ఇదిగదా శూన్యవాదము.

స్థౌలతిష్యుడొక్క నిమేషము మనస్సున ప్రార్థన సలుపుకొనెను. వెంటనే తన కడనున్న దండముతీసి “దుర్మార్గుడా! కుత్సితవాదమునకు నీ కిదే శిక్ష” యని, వెనుక తల పై తగిలినచోటనే మరల పుర్రె పగులునట్లు తూచికొట్టెను. “హా,” యని అమృతపాదార్హతులు తలపగిలి, రక్తము స్రవింప చైతన్యరహితుడై పడిపోయినాడు. 

12. పూర్వస్మృతి

స్థౌలతిష్యు డా దెబ్బకొట్టి, అమృతపాదులు పడిపోవగనే సింహము వలె లేచి, ప్రక్కనున్న గంటవాయించెను. కాషాయాంబరధారులగు శిష్యులు నలుగురచ్చటకు బరుగిడివచ్చిరి. వీరి వాద ప్రతివాదములువినుచు, దూరముగ కంబళుల పై, కృష్ణాజినములపై నాశీనులై యున్న భిక్షుకులు అమృతపాదులు పడిపోవగనే, యచ్చటకు పరుగిడివచ్చి చైతన్యరహితుడైయున్న తమ ఆచార్యుల తల నొకరు పట్టుకొనిరి. ఏడ్చుచు కాషాయోత్తరీయము చింపి, వెల్లువలై ప్రవహించు గాయముపై ఒక రదిమి పట్టుకొనిరి. తక్కినవారు వేదనతో చుట్టును మూగిరి.

స్థౌలతిష్యుడు వారినందరిని అదలించి, నిర్వికారమగు చిరునవ్వుతో, అమృతపాదులపై అతికరుణార్ధ్రమగు చూపులుపరపి, “తండ్రీ! నీకు పూర్వస్మృతి కలుగుటకై ఈ విధాన మవలంబించితిని. ఈశ్వరుని ప్రేమ ఎట్టిదో చూచెద” ననుచు, వెంటనే అతిజాగరూకతతో, తన వైద్యశాలలో నొక మంచముపై పరుండబెట్టించి, అస్త్ర పేటిక తెరచి, అందుండి నిశితమగు నాయుధములు దీసెను. వేరొక రజత మంజూషనుండి ఒక కాచపాత్ర గ్రహించి అందుండి ఒక తైలము నా అస్త్రములపై పోసెను.

అమృతపాదుల గాయమునుండి రక్తము స్రవించిపోకుండ మొదటనే ఫాలమునకు దిగువనే ఆ వృద్ధతపస్వి వస్త్రముచే బిగించికట్టెను. శిష్యు డొక డింకొక కాచపాత్ర నందీయ, అందుండి మరియొక తైలవిశేషమును స్థౌలతిష్యు డా గాయము పై పోసెను. వెంటనే రక్తము కరిగిపోయి గాయము నిర్మలమైనది.

అమృతపాదులు లంబికాయోగము ధరించిరేమో, నుదుట గుడ్డ కట్టకుండగనే రక్తము స్రవించుట మొదటనే మానినది. గాయముకడ నున్న రక్తముమాత్రము స్రవించిపోయినది.

లలితములై, సూర్యకిరణ సదృశములై, శక్తిమంతములైన తన వ్రేళ్ళపై స్థౌలతిష్యుడొక తైలమును పోసికొని ఆ తైలమును రెండు చేతులకు పులుముకొని, నిశితములై, మహాపురుషుల తపస్సులవలె మొనయుచున్న రెండు శస్త్రములు తీసెను.

ఆ మహర్షి తీక్షణదృష్టిచే అమృతపాదులను చూచెను. ఆతడు లంబికా యోగము లోనికి పోయినాడు. ఆతడు జీవించియు శవము. అతని హృదయమునందు చలనములేదు. ఊపిరిలేదు. కంటిపాపలు వెనుకకు తిరిగిపోయెను. దేహము కొయ్యబారిపోయెను. కాని

అడివి బాపిరాజు రచనలు - 2

• 266 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)