పుట:Himabindu by Adivi Bapiraju.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూక్ష్మాతిసూక్ష్మమగు నాతని ప్రాణనాడి మాత్రము దేహ మెల్ల ప్రసరించియే యుండెను. స్థౌలతిష్యుని కనులు వెలిగిపోవుచుండెను. మంత్రములు జపించుచు, ధ్వని రహితముగ పెదవుల కదల్చుచు, ఆ శస్త్రములచే గాయముకడ కపాలశల్య మాతడు ఛేదించెను. ఆ శల్యమును నాల్గువైపులగోసి ఆ శల్యపుముక్కను తీసి పుఱ్ఱెపై నుంచెను. ఆలోన అనేక సూక్ష్మనాళములు లున్నవి. వానిలో కొన్ని తెగి అచ్చట రక్తము ఒక్కతిలలో పదవభాగమంత గడ్డకట్టి యుండెను. ఆ కరడుగట్టిన రక్తకణ భాగమును తీసివేసి ఆ ప్రదేశమంతయు అతిసున్నితముగ శుభ్రముచేసి నాళములను సర్ది, ఎముక కుట్టి, ఆమీద ఔషధలేపన మొనర్చి, చర్మమునుకుట్టి కట్టుకట్టెను.

తోలుపరచిన ఆ మంచమునుండి అమృతపాదులను వేరొక పల్యంకముపై పరుండబెట్టి, అమూల్యమగు నొక తైలమును హృదయముపై నెమ్మదిగ పూయించెను.

ఈ శస్త్రచికిత్స యంతయు ఒక అర్థఘటికామాత్రము పట్టినది.

అచ్చటనుండి స్థౌలతిష్యుడుపోయి గంగాజలములో స్నానముచేసి వచ్చి, శుభ్రవసనములు ధరించి అమృతపాదులకడ కృష్ణాజినాసనముపై కూరుచుండి ప్రణవమంత్రోపాసకు డయ్యెను. ఆ మంత్ర పునశ్చరణము మహావేగవంతమై, దివ్యపథ సంచారియై సప్తలోకాలు నిండినది. విశ్వమున ప్రజ్వరిల్లినది.

“ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధేపదం సమూహమస్యపాంసురే” అను మహావిష్ణు పథములవరకు ప్రసరించినది.

సాయంకాలమైపోయినది. స్థౌలతిష్యుడు సమాధిలోనికి బోయెను. అతనికి లోకములులేవు. సృష్టి లేదు. ఏమియు లేదు. ఆతడే అంతయు నైనాడు. ఆతడే సత్యము. ఆతడే జ్ఞానము, ఆతడే జ్ఞాని, ఆతడే జ్ఞేయము నైనాడు. అటు లంబికాయోగమున నున్న అమృతపాదులకు సర్వము శూన్యము. ఆత డా శూన్యమున ఒక మహాత్తత్వము. ఆ మహాత్తత్వము, ఆ శూన్యము ఒకటియైనవి. ఆతనిజ్ఞానము ఆతనిలో లయమైనది. ఆతడు శూన్యములో లయమైనాడు. లంబికాయోగము వీడినది.

అచ్చటనుండి అమృతపాదుల కొక స్పందనము తోచినది. విశ్వమంతయు నాక్రమించుకొన్న ఒక సూక్ష్మదీపకళిక యైనాడు. ఆ దీపకళిక విశ్వరూపమగు ఆదిత్యమైనది. ఆదిత్యము, ఒక మహాతేః పుంజమైనది. అందుండి లోకము లావిర్భవించినవి. లోకములనుండి భూమి భూమి, యంతయు తానైనాడు. తా నా భూమియం దున్నాడు. ఆభూమిలో జంబూ ద్వీపము, అందు భరతవర్షము అందు కాళికా ప్రదేశము. తాను గంగలో పడవలో పోవుచున్నాడు. ఆతనితో ఆ నావలో ఒకపెద్ద, ఒక పుణ్యస్త్రీ, వేరొక పుణ్యాంగన ఇరువదిరెండు వత్సరముల సాధ్వి, ఆమెచేతులలో ఆటాడుకొను పదిమాసముల పసికూన ఒకబాలిక.

ఆ తేజశ్శాలి వృద్ధుడు తనతండ్రి. ఆయన ప్రక్కనున్న యామె, తన తల్లి, తనభార్య ఆ జవ్వని, ఆమె చేతిలోని బిడ్డ తన బిడ్డ. తాను త్రయార్హేయ మౌద్గల్యస గోత్రోద్భవుడై, ఆపస్తంభసూత్రుడై, యజుశ్శాఖాధ్యాయియైన నందిదత్తుడు. ఇంతలో ఆ పడవ మునిగినది. ఏమయ్యెను? అంతయు తమస్సు!

ఇంతలో అమృతపాదులు కన్నులు తెరచెను. ఎదుట ఎవరు? తన తండ్రి పోలిక మహాయోగమున నున్న తేజఃపుంజము!

అమృతపాదులు కళ్ళు తెరచుట ఏమి, స్థౌలతిష్యుడును కళ్ళు తెరచెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 267 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)