పుట:Himabindu by Adivi Bapiraju.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేమించి క్రుంగిపోవుచున్నది. ఈ విషయమే ముక్తావళీదేవి భర్తతో నెప్పుడూ హెచ్చరించుచుండెను.

ముక్తావళీదేవి: మీ రీ విషయమున నేమియు జోక్యము కలుగజేసి కొనకున్నచో దానిసంగతి ఏమి కావలయును?

కీర్తిగుప్తుడు: ఏమియుకాదు. నేను ఎప్పటివిషయము లప్పుడే తెలిసికొనుచున్నాను. శ్రీకృష్ణసాతవాహన విషకన్యల ప్రేమ జగద్విదితమైపోయినది. సార్వభౌమునికి మధ్యవర్తులచే యువరాజు తన యభిప్రాయము నిస్సంశయముగ తెలియజేసినాడు.

ముక్తా: అయినా హిమబిందున కది యేమిలాభము? ఆమె ఆతని ప్రథమభార్య కావచ్చును. విషకన్య రెండవభార్య కావచ్చును. హిమబిందు ధర్మపత్నియు, విషకన్య ప్రేమపత్నియు అగుదురు.

కీర్తి: యువరాజు తండ్రివలె ఏకపత్నీవ్రతుడు.

ముక్తా: చక్రవర్తి యువరాజునకు విషకన్యతో వివాహ మెట్లంగీకరించును? ఆమె ఊర్పులే మృత్యువందురుకదా?

కీర్తి: అందురు దేవీ! వారి కేమితెలియును మానవజీవిత తత్వము! విషకన్యను వినా యువరాజు మరొకరిని వివాహమాడడు. విషకన్యను వివాహమాడనినాడు రాజ్యమునే త్యజించును.

ముక్తా: మన అల్లుడు చారుగుప్తుని సమ్మతిగైకొనక మహారాజు విషకన్యను కోడలినెట్లు చేసుకొనును? అల్లుని తపస్సు, బిందును మహారాణిని చేయవలెనని కదా?

కీర్తి: అవును ముక్తా! (కీర్తిగుప్తుని హృదయము అతి ఆర్ధ్రత నందినప్పుడు భార్యను ముక్తాయని పిలుచును) కాని చారుగుప్తుడు శ్రీకృష్ణ మహారాజు హృదయము నింతయైన గ్రహింపలేదు. తా నొకటి తలచిన దైవ మొకటి తలంచును. స్థౌలతిష్యులవారు ప్రపంచాద్భుతుడు. బౌద్ధ సన్యాసులు దేశదేశములకు బోధకై పోవుచుండ, ఆర్య ఋషులను వారి వెనుకనే పంపి, వేదధర్మములు ప్రపంచమునకు చాటింపజేసినాడు. నేను యోర్దను దేశముపోవ నచ్చట స్థౌలతిష్యుని శిష్యులుండిరి. తురష్కమున, పారశీకమున, బాహ్లికమున ఆయన శిష్యుల జూచితిని. అట్టి పురుషుడు చక్రవర్తిపై కత్తిగట్టెను. చారుగుప్తుడు స్థౌలతిష్యుని శక్తి వమ్ము చేయ దీక్షవహించి, సఫలీకృతుడైనాడు. చక్రవర్తిపై కుట్రలు నాశనము చేసినాడు. వ్యతిరేకించిన సామంతుల నుక్కడగింప జేసినాడు. ఆంధ్ర సామ్రాజ్యమునకు భరుకచ్ఛము సముపార్జించి పెట్టినాడు. ఆంధ్రచక్రవర్తిని జంబూ ద్వీపమునకు చక్రవర్తిని చేయుచున్నాడు. కావున చక్రవర్తి తన యాలోచన వినకపోవు నాయని ఆశపడుచున్నాడు.

ముక్తా: ఇంక నాతల్లి క్రుంగి, కృశించి, హృదయము శకలములు చేసుకొనవలెనన్న మాట. మీరు నా మాట వినండి. ప్రాణేశ్వరా! మీరు తలచుకొనినగాని ఈ సంకటము చక్కబడదు. హిమబిందు లోలోననే కృశించి తనతల్లిని చేరిపోవునను భయము వేయుచున్నది.

కీర్తి: ముక్తా! నీవు యవనస్త్రీవి. ఆర్యనారీమణులశక్తి నీ వెరుగవు. ప్రజాపతే తన కొమరితను రక్షించుకొనును. ఆయినను ఈలోన నేను శ్రీకృష్ణమహారాజుతో అన్నియు మాటలాడెదను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 260 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)