పుట:Himabindu by Adivi Bapiraju.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడ నిర్మాణము చేయించెను. ఆ శిల్పులే ఆంధ్రచైత్యములలో తమ విధానములను అక్కడక్కడ విన్యసించిరి. అప్పుడే గాంధారించుటయన శిల్పము చెక్కుట యనుమాటకూడ ఆంధ్ర భాషలో చొచ్చినది.

పాటలీపుత్రమున చిన్ననాటనే కీర్తిగుప్తులు ఒక మహాహర్మ్యము నిర్మాణము చేయించెను. వినయగుప్త చారుగుప్తులకును అచ్చట మహా భవనములున్నవి. యుద్ధానంతరము ఎవరి భవనములలో వారు ప్రవేశించి, యవి యన్నియు మరల బాగుచేయించుకొనినారు. సమవర్తి, చారుగుప్తుల భవనములలో నొకదాన ప్రవేశించినాడు.

కీర్తిగుప్తులకు డెబ్బదియేండ్లు దాటినను, “ప్రపంచ మానంద మయము. ఆవల నేమియున్నదో ఎవరికెరుక? బ్రతికియుండగనే ఆనందము ననుభవింపుము” అను యవనవేదాంతి ఎపిక్యూరియసు వాదమును నమ్మినాడు. కావుననే అతడు భోగముల ననుభవించుటలో గ్రీకులకే పాఠములు నేర్పుచుండెను.

గ్రీకులు తమదేవతలను భారతీయ దేవతలతో పోల్చుకొని వారే వీరను నిశ్చయమునకు వచ్చిరి. కొందరు యవనులు బౌద్ధదీక్ష గైకొనినను జీవితము నానందముగ ననుభవింపుము అన్నభావము మిశ్రితముచేసి ఒక నూతనవాదము గొనివచ్చిరి.

కీర్తిగుప్తుడు మంచి మాటకారి. ముక్తావళీదేవికి భర్తయే భగవంతుడు. కాపురమునకు వచ్చిన కొత్తలో భారతీయాచారములకు సంకటము పడునది. కాని రానురాను భారతీయాంగనలకే పాఠములు నేర్పు భారతీయత్వ మామె కలవడినది.

ముక్తావళీదేవిని, హిమబిందును సువర్ణశ్రీ గుహాబంధమునుండి విడిపించినప్పటి నుండియు నామె సువర్ణశ్రీ చరిత్రమంతయు జాగరూకతగ గమనించుచునే యుండెను. సువర్ణశ్రీని తన మనుమరాలు గాఢముగ ప్రేమించుచున్నదని ఆమె ధాన్యకటకముననే గమనించినది. తన యల్లుడు హిమబిందును శ్రీకృష్ణసాతవాహన ప్రభువున కీయ సంకల్పించుకొనె ననియు హిమబిందు మూగదానివలె నందుల కియ్యకొనెననియు వినినప్పు డామె ఎంతయో ఆశ్చర్యమందెను.

ఆనాటినుండి హిమబిందు హిమబిందుగ నుండుటలేదని యామె గమనించుచు వచ్చినది. ముక్తావళి దేశమైన ఏథెన్సులో రాజులను విపరీతముగ గౌరవించుట ఎరుగదు. అక్కడ రాజవంశములు లేవు. కాని మాసిడోనియాలో రాజవంశము విజృంభించినది. అచటి సేనాపతులు వివిధ దేశముల రాజులై రాజవంశ ప్రారంభకులైరి.

ఈ దేశమున రాజులు ధర్మపరులు. ప్రజలకు రాజభక్తి కలదు. రాజులకన్న బ్రాహ్మణులు మరియు గౌరవమందుదురు. రాజులును, బ్రాహ్మణులును అయిన సాతవాహన ప్రభువంశమునకు పిల్లనిచ్చుట ఎవ్వరికైనా గౌరవావహమే. అందుకనియే తనయల్లుడు శ్రీకృష్ణమహారాజునకు పిల్లనీయ సంకల్పించినాడని ముక్తావళీదేవి గ్రహించినది.

తన ముద్దుల మనుమరాలు జగదేకసుందరి, శ్వేతతారాదేవి కెనయైనది. విద్యల ప్రజ్ఞాపరిమితాదేవియే. ఆ బిడ్డకొరకే తాను బ్రతికియున్నది.

తనభర్త కీర్తిగుప్తుడును హిమబిందునుచూచి దుఃఖము దిగమ్రింగి, దుఃఖ పాతాళమున క్రుంగిపోయిన యల్లుని ఊరడించువారు. అప్పటినుండియు హిమబిందును తనే పెంచినది. భార్యాభర్తలిరువురు అల్లునియింటను, తమ యింటను సమముగ కాలము గడుపుచు హిమబిందు తోడిదే లోక మనుకొనుచుండిరి. ఆ బాలిక నేడు సువర్ణశ్రీని

అడివి బాపిరాజు రచనలు - 2

• 259 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)