పుట:Himabindu by Adivi Bapiraju.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధా: హిమబిందువదిన చెడ్డదికాదు. సమవర్తితో వదిన “ఈ బాలిక ధర్మనందిగారి చిన్న కొమరిత” అని తెలిపినది. ఆయన “ఈమెకు అన్న లెంతమంది?” యని అడిగినారు. వదిన “ఒక్కడే!” అని ప్రత్యుత్తరమిచ్చినది. అప్పుడు సమవర్తి “అటులనా, ఇరువు రనుకొంటిని. ఏలన ఈ బాలిక మోమును, నాకొక నూతన అంగరక్షకుడు వచ్చినా డాతని మోమును ఒక్క పోలిక నున్నవి” అనినారు.

సువర్ణశ్రీ: ఓహో! సమవర్తి నిజమునకు దగ్గరగ వచ్చు చున్నాడు.

సిద్ధా: నిజ మేమిటి అన్నా?

సువర్ణశ్రీ: ఆ నవవీరుడు మనకు దగ్గరచుట్టములే తల్లీ!

సిద్ధా: ఆ క్రొత్తవానిని నే నెరుగుదునా?

నాగ: ఎరుగుదువు! ఎరగవు. అది మన కేలనే! హిమబిం రెట్లున్నది?

సిద్ధా: బాగుగనే యున్నది, కాని ఎప్పుడును ఏదియో యాలోచించును. బాలనాగిని నా కొరకై పంపును. నేను వెళ్ళగనే నన్నొక నిమిషమైన వదలదు.

సువ: నీవు సమవర్తి శిబిరమునకు పొమ్ము. ఆయనయు నిన్ను వదలడు.

ఇంతలో సమవర్తి సాతవాహన సేనాపతి సువర్ణశ్రీని చూచుటకు వచ్చినాడని ఒక దళవాయి గుడారము గుమ్మముకడనుండి తెలియజేసెను. అతని వెనుకనే సమవర్తియు ద్వారమునుండి లోనికి వచ్చినాడు. నాగబంధునిక యచ్చట శిల్పముచేసిన విగ్రహమువలె కదలలేక నిలుచుండి పోయినది.

సమవర్తి నాగబంధునికను జూచి అవరోధజన ముండిరని వెనుకకుబోవ నుంకించుట కనుగొని సువర్ణశ్రీ నవ్వుచు, “లోనికి రండు! సంశయింపబనిలేదు. ఈ బాలిక మా చిన్నచెల్లెలు. ఇదివరకే హిమబిందు శిబిరములకడ చూచినారు. ఆమె మాపెద్దచెల్లెలు.

సమవర్తి తెల్లబోయి, మాటకై ఒకనిమేషము వెదకికొని, “నా కడకు వచ్చిన ఒక బాలకునిగూర్చి మిమ్మడుగవచ్చితిని. స్వైత్రులవారు మీరు గొనివచ్చిరని తెలిపినారు” అని వచించెను.

సువర్ణశ్రీ: ఈ నా పెద్దచెల్లెలు చటుక్కున పురుషుడై పోవును. ఆనాటి ఎడ్లపందెము కాలమునుండి మీకు బాసటగ విరోధుల తలపడవలెనని కోరికోరి నేడది ఫలవంతము చేసికొన్నది.

సమవర్తి ఆశ్చర్యమంది, ఏమి.... మీ.... మీ.... చెల్లెలా! అందుకే... అందుకే.... పోలిక....” అని వాక్యము పూర్తిచేయకుండగనే నిలిచెను.

నాగబంధునిక తుర్రున మాయమయ్యెను. సువర్ణశ్రీయు, సమవర్తియు ఆవైపునకు జూచుచు చిరునవ్వులు మోముల పై ప్రసరింప ఒకరి నొకరు చూచుకొనిరి. సిద్ధార్థినిక “అక్క పారిపోయిందేమి?” అని ప్రశ్నించినది. 

4. సువర్ణశ్రీ పలాయనము

“ఎవరీ విషకన్యక? ఈ విషకన్యకకు, మహారాజు శ్రీకృష్ణునకు సంబంధమేమి? ఈ విషకన్యను ప్రయోగించటమేమి?” అని చారుగుప్తుడు పాటలీపుత్రమునందు తాను బసచేసిన భవనమున, ప్రార్థనామందిరమున బుద్ధపాదుకల పీఠమున కెదురుగనున్న

అడివి బాపిరాజు రచనలు - 2

• 245 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)