పుట:Himabindu by Adivi Bapiraju.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసనముపై అధివసించి, “ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి” అని ప్రార్థన సల్పుచు మనసున వివిధాలోచనలపాలాయెను.

మహారాజుకడనున్న అనుయాయులు ఆ విషయము నిగూఢరహస్యముగా నుంచుటచే తనకు చూచాయగమాత్రము తెలిసినది.

హిమబిందుకుమారి వివాహవిషయము ఎందరు పెద్దలు హెచ్చరించినను తనకు వివాహ మక్కరలేదనియు, తాను బ్రహ్మచారిగ మాత్ర ముందుననియు యువరాజు ప్రతివచన మిచ్చినారట.

తనబాలిక యందము అతిలోకముకదా! ఇంతవరకు దేశదేశముల నుండి తన తనయను తమబాలుర కిమ్మని మహారాజులు, కోటీశ్వరులు వర్తమానము లంపుటలేదా? ఆంధ్రబాలురలో తనబాలికను చూచి మతి పోనివా డుండెనా? ఇందేదియో విచిత్ర మున్నది. త్వరలో యువరాజు నునుమతినంది, వివాహనిశ్చయ మహోత్సవ మీ పాటలీపుత్రములో జరిపింపవలయును.

ఈ సువర్ణశ్రీ పాటలీపుత్రము చక్రవర్తివశమగుటకు కారణభూతు డైనాడే. ఎంతటి చిత్రమైన ఎత్తువేసినాడు! ఎంతపెద్ద సేనాధికారికిగూడ నట్టియుక్తియే తోచలేదేమి? మొన్న చక్రవర్తి ఆ అఖండజయోత్సవమున సువర్ణశ్రీని జయకిరీటధారి నొరించినాడు. ఆ బాలుడు దివ్వునివలె వెలిగిపోయినాడు.

తనకుమారి అతని జయోత్సవమున అంత ఆనంద మందినదేమి? తన్ను రక్షించిన యువకుడు పాటలీపుత్ర పతనమునకు కారకుడైనాడని కాబోలు! సోమదత్తాచార్యులును తానే జయమందినట్లు ఉప్పొంగిపోయినాడు.

ఈ ఆలోచనలతోడనే చారుగుప్తులవారు జపము ముగించుకొని తమ మందిరము లోనికి పోయినారు. అక్కడ సమవర్తి యుండెను. చారుగుప్తుడు లోనికి వచ్చుటయు, సమవర్తి మేనమామకు నమస్కరించి, ఆయన రత్నకంబళిపై అధివసింపగనే తానును కూరుచుండెను.

“మామయ్యగారూ! ఆంధ్రులు అఖండవిజయసంపన్నులగుటకు మీరే కారకులు. మీ పరమసంకల్పము శతథా విజయమందినది. ఇంక హిమ వివాహ విషయము తేల్చవలసియున్నది.”

ఇంతలో లోనినుండి అమృతలతాదేవియు, భిక్షుకుడైన వినయ భిక్కును ఆ మందిరములోనికి వచ్చిరి.

అమృతలతాదేవి: అన్నా! నీవు మావానికి హిమను ఇత్తు వని మే మందరము ఆశించియున్నాము. మా సమవర్తి విజయపరంపర నీవు వింటివికదా! ఇంక అందరును ఇచ్చటనేయున్నారు. సమవర్తికి హిమబిందుకు మనువు నిశ్చయము చేయించి, ప్రదానోత్సవము. చేయింపుము.

వినయ: కుమారా! నా ఉద్దేశ్వము అదియే! నేను నీకు సలహా నిచ్చుచున్నది తండ్రినై కాదు. భిక్షువునయ్యు, మా గురువులగు అమృత పాదార్హతులు నిందుల కియ్యకొనుటచే నిట్లు చెప్పుచుంటిని.

చారు: చెల్లీ! నీ మాటయు, నాన్నగారిమాటలు ఎంతయు సమంజసములే! అయినా నేను చిరంజీవి హిమబిందును శ్రీకృష్ణసాతవాహన మహారాజుకీయ నిశ్చయించి, చక్రవర్తిగారికి నా మనవి నివేదించితిని. అందుకు చక్రవర్తులను, సామ్రాజ్ఞి ఆనందదేవి మహారాణియు సంతోషమున సమ్మతించినారు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 246 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)