పుట:Himabindu by Adivi Bapiraju.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుగుప్తునకు ముచ్చెమటలుపోసినవి. నోట తడియారెను. గుండె దడదడ కొట్టుకొనెను. అమృతపాదార్హతులు చారుగుప్తుని తీక్షణముగ నొక నిమేష మాత్రము చూచి, నవ్వుచు “ఏమండీ చారుగుప్తులవారూ! ఈ మాటలకే ఇంత భయపడుచున్నారా? స్వప్నములకు ధీరులు భయపడరు. భయపడవలసినది మనలోని కల్మషములకు కదా! మనయత్నములు ఫలింపక అన్యథా యైనంతమాత్రమున మానవుడు వ్యధలపాలు కావలసినదేనా? సర్వము శుభమునకే” యని అనునయించెను.

చారుగుప్తుడు లేని ధైర్యము మోమున ప్రతిఫలింపజేసికొని, చిరునవ్వు నవ్వుచు, అమృతపాదార్హతులకు నమస్కరించి, “భగవానులవారీ శిష్యుని క్షమింతురుగాక! అందరము ప్రపంచము శాశ్వతమనుకొని కార్యముల నొనరింతుము. ఆ కార్యము భగ్నమైనచో వ్యాకులమొందుదుము. దుఃఖములకు వెరచు స్వభావము నాకు లేదు. ఒక విషమఘటన నాహృదయమును వ్రక్కలుచేసినది. ఆ విచారమును నా కన్నతల్లి హిమబిందును పెంచుకొనుటలో మరచిపోతిని. బిడ్డకు ఏమైన ఆపద వాటిల్లిన నా బ్రతుకు హుళక్కి!”

చంద్రస్వామి చారుగుప్తుని చూచి “వర్తకచక్రవర్తీ! నీతనయ కేమియు హాని రాదు. ఆమె మహదానందము నందును. ఆమె ప్రపంచ పూజ్యత నందును. ఆమెయు ఆమెభర్తయు లోకకళ్యాణ రూపు లగుదురు. ఆమె భర్త ఎవరగుదురో ఆ వ్యక్తిని నేను తెలియజేయలేనుగాని, ఈ కాలమునకు ముహూర్తము కట్టిచూచితిని. ఆమె భర్త ధిగంత యశోవిశాలుడగును. మహావిక్రముడు, శుద్ధసత్వరూపుడు, మనోవాక్కాయ బుద్ధ్యహంకారముల నాతని ప్రేమించి నీ బాలిక పెండ్లియాడును” అని మోము పరమతేజస్సున వెలుంగ దివ్యవాక్కులు పలికినాడు.

అమృత: వర్తక చక్రవర్తీ! నీతనయ ఆనందముకన్న నీకు గావలసిన దేమి?

చారు: నిజము భగవాన్, నా తనయ ఆనందమే నాయానందము. 

25. ఎవరు మహారాణి కావలసినది?

ఉజ్జయిని శత్రువిముక్తమైన పదునైదు రోజులకు శ్రీముఖసాతవాహనుని లేఖ శ్రీకృష్ణసాతవాహనునకు అందినది. ఆ లేఖ చదువుకొనుట తోడనే యత్యాశ్చర్యమంది యువరాజు తనమందిరమున గూర్చుండలేక పోయినాడు.

“మా కుమారులు చిరంజీవులు యువరాజు శ్రీకృష్ణసాతవాహన మహారాజును ఆశీర్వదించి వ్రాయునది. తండ్రీ! మీ విజయమునకు మే మెంతయు సంతసించితిమి. ఇచ్చట మహోత్సవము లెన్నియేని జరుగు చున్నవి. అన్నిటికన్న ముఖ్యమగు సంతోష వార్త చారుగుప్తుని తనయను శత్రువుల బారినుండి రక్షించుట. ఆ బాలికతోపాటు శ్రీ ముక్తావళీ దేవిగారును రక్షింపబడుట. మీ తమ్ముడు చిరంజీవి శ్రీ మంజుశ్రీ కుమారుడు కందరమున దొరకుట అద్భుతవిషయము. మీ తల్లి యానందముచే మైమరచి పోయినది. మాకును అత్యానందము కలిగినది.

“చారుగుప్తుల వారిని మీ రెరిగియేయుందురు. భూమికి అదిశేషు వాధారమైనట్లు సాతవాహనవంశమునకు చారుగుప్తుల వారాధారులు. అన్ని విధముల వారు మన

అడివి బాపిరాజు రచనలు - 2

• 223 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)