పుట:Himabindu by Adivi Bapiraju.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయరమాస్వయంవృతుడగు యువరాజును చూచును. ఆతడును అతి లోకసుందరి యగు తన బాలికను చూచును. చక్రవర్తి శుభవర్తమాన మందగనె, శ్రీకృష్ణుని మనస్సు హిమబిందుపై సంపూర్ణముగ లగ్నమగును. వారిరువురును కలసి పాటలీపుత్రము వరకు ప్రయాణము చేయుటయు ఈ కార్యమున కానుకూల్యము సంపాదించును.

పాటలీ పుత్రము తమవశమగుటతోడనే జరుగు సకలజంబూద్వీప పట్టాభిషేకోత్సవ సందర్భమున తన తనయకు, శ్రీకృష్ణసాతవాహన మహారాజునకును ప్రధానమంగళము జరుగగలదు. ఆ యుత్సవము లోకోత్తర మగుగాక!

చారుగుప్తుని పరిచారకు డొకడు లోనికి జనుదెంచి “స్వామీ! తమ్ముచూడ అమృత పాదార్హతులు చంద్రస్వామిద్వితీయులై వచ్చుచున్నా” రని విన్నవించెను.

తోడనే చారుగుప్తుడు ఆసనమునుండి లేచి, ద్వారముకడకు వేగముగబోయి ద్వారమును సమీపించిన అమృతపాదార్హతుల పదములకెరగెను. లేచి చంద్రస్వామికి నమస్కరించెను.

అమృతపాదార్హతులు “బుద్ధ! బుద్ద!” యని యాశీర్వదించిరి. చంద్రస్వామి “దీర్ఘాయుష్మాన్ భవ. సంకల్పసిద్ధి రస్తు” అని ఆశీర్వదించెను. వారందరు లోనికి బోయిరి.

చారుగుప్తుడు: దేశికులు ఈ శిష్యుని అనుగ్రహింప విచ్చేసినారు.

అమృతపాదార్హతులు: వణిక్సార్వభౌమా! ఈ ప్రత్యూషమునందు నా కెన్నడురాని స్వప్నమొకటి వచ్చినది. మీరు వేగమున నొక మహా నగరమునకు బోవుచుంటిరి. మీహస్తముల పూలునిండిన పూర్ణకలశ మున్నది. అట్లు పోవుచున్న మీకు నే నెదురైతినట. నాహస్తమున శ్వేతపన్నగి యోర్తున్నదట. తమ్మా పన్నగము చూచుటతోడనే కన్నులు కెంపులుగ్రమ్మ బుసకొట్టుచు నాచేతినుండి జారి ఎదుట ఆడుచు నిలిచినదట. నేను భయము లేదనుచున్నను మీరు వెనుకకు తిరిగినారట. మీ హస్తములనున్న పూర్ణ కుంభమును ఒక మహాగరుడుడు వేగముగ పర తెంచి వచ్చి కాలదన్నుకొని పోయెనట. నాకు వెంటనే మెలకువ వచ్చినది. నేను చంద్రస్వామి పండితుల ఆ స్వప్న భావము నడిగితిని. వా రనునది నా కెంతయు నాశ్చర్యము గొల్పుచున్నది.

చారు: వారేమనినారు స్వామీ?

అమృత: వారే వచియింతురుగాక!

చంద్రస్వామి: చారుగుప్తులవారూ! నాకు శ్రీభగవానుని స్వప్నము విచారింప నొక్క విషయము తోచినది. కాని స్వప్నములు నిజమగునా?

అమృత: అటు లనకుడు! స్వప్నములు రానేరావు. వచ్చిన వాని కేదియో పరమార్థముండును. అనారోగ్య కారణమున వచ్చు కలలకు అర్థముండకపోవచ్చుగాక! కొందరు ఆయుర్వేదపండితులు ఆ స్వప్నముల ననుసరించి రోగమేదియో స్పష్టముగ తెలియవచ్చు నందురు.

చారు: పండితులవారూ! తమ భావము తెలియజేయుడు.

చంద్ర: చిత్తము. మీరు మహాసంకల్ప మొకటి పూనినారు. ఆ సంకల్పము వేరుదారిని పోవును. అట్లుపోవుటకు కారణము శ్రీశ్రీ భగవానులే. భగవాను లనుటకన్న వారినుండి వెడలిన ఒక విచిత్రసంఘటన కారణమగును. కావున నది శుభాంతము కాకతీరదు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 222 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)