పుట:Himabindu by Adivi Bapiraju.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంశమునకు అతి సన్నిహితులైనారు. వారికి ఒకర్త తనయ. ఆమెయే కదా హిమబిందు కుమారి! ఆ బాలిక మహాలక్ష్మి. ప్రజ్ఞా పరిమితాదేవి అవతారము. సౌందర్యమున ఆమె కెవరు దీటురాగలరు? అన్నిట ఆమె కామెయే సాటి. సాతవాహనవంశమునకు కీర్తిని, తేజస్సును కొనిరాగలిగిన ఆ బాలికను మీకు దేవేరిగా సమర్పింప చారుగుప్తుల వారు మా అనుజ్ఞ వేడినారు. మేమును మీ తల్లిగారును తక్షణ మంగీకరించితిమి. అట్టి సుగుణరాశిని, అతిలోకసుందరిని భావిసామ్రాజ్ఞిగా బడయ గలుగుట మహాభాగ్యము. కుమారా! మిమ్మల నందర త్వరలో కలుసు కొన కుతూహలము నందుచున్నాము. ఇట్లు శ్రీశ్రీశ్రీ కౌశికీపుత్ర శ్రీముఖ నామాంకితము.”

ఈ కమ్మ శ్రీకృష్ణసాతవాహనుని సంపూర్ణముగ కలంచినది. తానా హిమబిందు కుమారిని సువర్ణశ్రీ శకటవిజయ మందిన దినమున చూచినాడు. ఆమె అద్భుత సౌందర్యవతి యనిన మాట నిజము. కాని ఆ సౌందర్యము, తన కాశ్చర్యము మాత్రము కలిగించినది. ఆమెయందు యవనసౌందర్యము ఆంధ్ర సౌందర్యము మధురముగ మిశ్రమ మందినవి. కాని ఆమెను తానానాడు చూచినప్పుడు తనలోని రసార్చనయైన పులకరింపలేదు. ఆమె నొక దేవీ విగ్రహముగ జూచు భావమైన తనకు కలుగలేదు. మహాశిల్పి విన్యస్తమగు చైత్యాలంకార శిల్పముగ మాత్ర మామె తనకు ప్రత్యక్షమైనది. తాను అనేకులగు ప్రభుకుమారులవలె కామోపభోగములు వాంఛింపలేదు. తన ఆత్మేశ్వరి దివ్యదర్శన మగునంతవరకు తనలో ప్రణయభావ మంకు రింపనే లేదు.

ఆ బాలిక, ఎవరామె? ఆమె విషకన్యయా? అమృతకన్యయా?

“ఓ దేవి! మహోజ్వలమూర్తీ! నీవు నా కీ జన్మమున ప్రత్యక్షము కాక యున్నచో నే నీ యుద్ధమున ఏ శివస్వాతిబాణముననో ప్రాణములు వదలి యుందును. ఓ దివ్యసుందరగాత్రీ! ఓ పరమ వనితావతారమా! ఇన్నాళ్ళు నీవు దాగియున్నది. నా కొరకేనా? నిన్ను నాపై ప్రయోగించుట నా అమరత్వమునకే! నాకు నీ దర్శనమే కాకయుండినచో ఆంధ్ర సామ్రాజ్యమునకును నాకును సంబంధమే లేకయుండును!”

అని తనలో తాను మాట్లాడుచు విషవైద్యుని పిలువనంపెను. ఆ విషవైద్యుడు మహారాజుపాలిటికి బోధిసత్వుడే! శ్రీకృష్ణుడు ఉజ్జయినిలో తాను నివసించు, మహారాజ భవనమున కనతిదూరమున ఆ ధన్వంతరికి విడిది సమకూర్చెను. ఆ ధన్వంతరి భవనము నంటియే అంతఃపుర మొకటి యున్నది. అందు విషబాల నివాసము.

విషబాల సౌందర్య మిప్పుడు వర్ణనాతీతము. మధురపరిమళపూరిత హిమవాలుకా రూపమందిన సౌదామని వంటి ఆ బాల, విషరహితదివ్య పన్నగియై ఆ బాల నిష్కంటక కేతకీపుష్పమై తనచేతి కందు టెన్నడో!

కాని ఆమెలో విషము లింకను తగ్గలేదు. ఆమెకడకు వెళ్ళిన ప్రాణి కొలదికాలములో నశించును. ఆమె నంటిన ప్రాణి అందర్థకాలమున నశించును. ఆమెచే లాలింపబడిన శుక శారికా హరిణాది ప్రాణులు వెంటనే ప్రాణములు గోల్పోవును.

శ్రీకృష్ణుడు విషవైద్యునితో - “స్వామీ! ఆచంద్రబాలాదేవిని దర్శించి మూడుదినము లయినది. ఈ దిన మాదేవిని దర్శించి తీరవలయును.”

“ప్రభూ! ఏడుదినము లోపిక పట్టుడు.”

అడివి బాపిరాజు రచనలు - 2

.224.

హిమబిందు (చారిత్రాత్మక నవల)