పుట:Himabindu by Adivi Bapiraju.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవుననియు, ప్రక్కదేశము లరాజకములైన, బలవంతమగు దేశములుకూడ అనేక కష్టముల పాలగుననియు, శాతవాహనులు సకల భూమండలమునకు చక్రవర్తులగుట మానవ కళ్యాణమునకే యనియు, ఒక దేశ భాగ్య మాదేశపువర్తకముపై నాధారపడి యుండుననియు, ఆంధ్ర వైశ్యుల వర్తకము ఉత్తరప్రదేశముల వృద్ధిపొందుటకే వీలులేకుండ పోయినదనియు, సర్వధర్మరక్షణకై ఆంధ్రులు యావద్భారత చక్రవర్తులు కాకతప్పదనియు, చారుగుప్తుడు వాదించి శ్రీముఖునకు పాటలీపుత్ర సింహాసనముపై కోర్కె పుట్టించెను.

ఆతనికి సర్వభూవలయమునకు చక్రవర్తి కావలయునను ఆశకంటె, సర్వభూవలయమునకు శాంతి చేకూర్చవలయునను వాంఛ ఎక్కువైనది.

సకలదక్షిణాపథము శాంతముగ నున్నది. పాండ్యులు, చోళులు, కేరళులు, కుంతలులు తమలో దా మేమియు కలహములు లేక శాంతులై యున్నారు. ఒకరిదేశము నొకరు వాంఛింపనేల? చిన్నదేశమునకు రాజయిన నేమి, మహాదేశమునకు రాజయిన నేమి? యశముకొరకై పురుషుడు రాజ్యములు కాంక్షింపవలయునా? రాజులు రాజ్యతృష్ణచే లోకకంటకులగు చున్నారు.

ఇదియంతయు కలిమహాత్మ్యమేనా? ధర్మజచక్రవర్తి సభలో భూమిలోని నిక్షేపమునకై తగవులాడినవారి గాథనిజమా? మొదటిదినమున “నీది, నీది, యని తగవులాడిరట; కలిప్రవేశించిన మరునాడు “నాది, నాది” యని తగవులాడిరట.

రాజుల ధర్మము లోకమున శాంతి నెలకొల్పుట. కాణ్వాయనులు ధర్మచ్యుతులైరి. బుద్ధ భగవానుడు సంచరించిన పవిత్రభూమి యగు ఆర్యావర్తమంతయు వీరివలన అధర్మములతో నిండిపోయినది.

భగవంతుని కనుగొను కర్తవ్యము మనుజునిది. తన నడవడిచే మహర్షులు, అర్హతలు, జ్ఞానులు, రాజులు లోకమునకు దారిచూపించవలయును. అధర్మము విజృంభించిననాడు భగవంతుడంతర్హి తుడగును. అధర్మము నణచుట రాజుల ధర్మము. తానుగాని తనపూర్వులుగాని రాజ్యకాంక్షచే ధాన్యకటక శ్రీకాకుళములనుండి పడమటి తీరమునకు విజృంభించినారా? మహామధ్యరథికులు, అభీరులు విజృంభించి దక్షిణా పథమును, కుంతలమును పాడుచేయ ప్రారంభించినప్పుడుకదా తా మారాజ్యముల నరాజకము నుండి యుద్ధరించినది.

ఈ విధమగు ఆలోచనలతో శ్రీముఖసాతవాహనుడు తన మదగజము పై ప్రయాణము చేయుచుండెను.

ఆంధ్రసైన్యములు మహావేగముతో సాగిపోవుచున్నవి. ముందు నడచు సైన్యములకు పాటలనగరము పదునైదు గోరుతములు మాత్రమున్నది. చారులు పట్టుకొని వచ్చిన వార్తవలన శ్రీ సుశర్మకాణ్వాయనుడు నగర కుడ్యములు, నగరచుట్టునున్న పదునెనిమిది కోటలు బాగుచేయించి తనకున్న అరువదివేల సైన్యమును, కౌశాంబీనగరమునుండివచ్చిన ముప్పది వేల సైన్యమును నగర రక్షణకై నచ్చటచ్చట నుంచినాడనియు, ప్రథమమున ఆంధ్రులు తనపై ఎత్తివచ్చుట నాతడు నమ్మలేదనియు, గయకడకు ఆంధ్రసైన్యములు వచ్చి విడియుటతోడనే భయపడి నగరరక్షణ సన్నాహములు ప్రారంభించినాడనియు తెలిసినది.

ఆంధ్ర సైన్యములో అరువదివేల కాల్బలము, వేయి ఏనుగులు, వేయి రథములు, రెండువేల ఆశ్వికదళము గయకడకు విడిపోయి, మాళవాభిముఖమైపోయినవి. ఆ

అడివి బాపిరాజు రచనలు - 2

• 198 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)