పుట:Himabindu by Adivi Bapiraju.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముక్తావళీ దేవి లేచి కూరుచుండి సువర్ణశ్రీని చూచి, “మన మిక్కడనే యున్నచో, విరోధులు వచ్చి మనల నాశనముముచేయరా?” యవి యడిగెను.

మహా: అమ్మా! మే ముండ మీ కేమియు భయములేదు.

ముక్తా: ఇక్కడనుండి ఎచ్చటకు బోవుట? ధాన్యకటకమునకా?

సువర్ణ: మహాబలుడు ఏమి చెప్పిన అట్లు చేయుదము.

ముక్తా:' యీ మహాబలు డెవరు?

సువర్ణ: ఈతడు గోండుదేశ యువరాజు. గోండుమహారాజు మన చక్రవర్తికి ప్రాణ స్నేహితులు. యీతడు నాకు పరమమిత్రము, మామ్మగారూ!

ముక్తా: నాయనా? నాహృదయమున జనించిన భయమింకను దీరలేదు. ఇచ్చటనుండి తరలించి మమ్ము వెంటనే సురక్షిత ప్రదేశమున కెచటికైన చేర్పింపుము. 

15. పాటలీపుత్రము

పాటలీపుత్రము గంగాతీరమున మాగధరాజధానియై భారతవర్ష చక్రవర్తులకు పెక్కు శతాబ్దములు రాజధానియై ప్రసిద్ధినందినది. యీ మహా నగరమునందు నంద సార్వభౌములు అఖండవైభవముగ రాజ్యము నేలిరి. వారివెనుక తద్వంశజుడైన చంద్రగుప్త మౌర్యుడఖండజంబూద్వీపమునకు చక్రవర్తి ఆయెను. ఆతని మనుమడు అశోక ప్రియదర్శి మహాసామ్రాట్టయి బౌద్ధమతావలంబియై భరతవర్షమంతయు రాజ్యముచేయుచు బౌద్ధమతమును వెన్నెలవలె, అమృతమువలె సకలలోకమునందు వరదలు కట్టించెను.

ఒకనాడు జంబూద్వీపమునకు అయోధ్య ముఖ్యనగరము; మరొకనాడు ప్రాగ్జోతిష నగరము, వేరొకప్పుడు కుండిన నగరము, కురువంశ కాలమునకు హస్తినాపురము, హస్తినాపురమునుండి కౌశాంబియు నటనుండి పాటలీపుత్రము రాజధానులుగా మారినవి.

ఏది ముఖ్యనగరమో, అచ్చట సింహాసనాసీను డగువాడు సకల భరత వర్షమునకు చక్రవర్తి యగును. మౌర్యులలో చివరివాని వధించి పుష్యమిత్ర శుంగుడు చక్రవర్తి యయ్యెను. అంత్యశుంగుని పేరునకు రాజును చేసి, కాణ్వాయనబ్రాహ్మమంత్రులు నిజ మగు చక్రవర్తులైరి.

తుది కాణ్వాయనవంశజుడు సుశర్మ తానే చక్రవర్తియని లోకమునకు వెల్లడించెను. అయినను మగధదేశమునందింకను శుంగుల సేనా నాయకులు శుంగమహారాజు కే జోహారు లొనరించుచు, సుశర్మకాణ్వాయనుని లెక్కచేయుటలేదు.

సుశర్మకును దేశములోపలుకుబడి ఎక్కువగనే యుండెను. ఆతని సైన్యములు మగధదేశమంతయు నిండియుండెను. ఈ ఇరువాగుల సైన్యములకు, వారి వారి మాండలీకులకు సర్వదాపోరులు సాగుచునేయుండెను.

దేశ మరాజకమై, హిమాలయప్రాంతమందలి గంధర్వయక్ష జాతులకు, కామరూపప్రాంత నాగులకు, అరణ్య జాతులగు పుళిందాదులకు కొల్లగొను ప్రదేశమై పోయినది. బలవంతుడగు చక్రవర్తి పరిపాలన లేకపోవుటచే వర్తకమును నీరసించినది. ఒక దేశమునుండి వేరొకదేశమునకు బేహారులు వస్తువులు కొనివెళ్ళుట మానిరి.

వింధ్యకు దక్షిణము మాత్రమే ఆంధ్రుల చల్లని పరిపాలనమువలన సర్వసంపదల తులతూగుచుండెను. దేశ మొకచో నీరసించియుండిన సర్వభరతవర్షము నీరసించి

అడివి బాపిరాజు రచనలు - 2

197

హిమబిందు (చారిత్రాత్మక నవల)