పుట:Himabindu by Adivi Bapiraju.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీకును ఉలూపికిని ప్రణయకలహము తీరినదా? నీవు సంతోషాన నింత జ్వలించు చున్నావు? నీ నాల్కలు చాచి నా పెదవుల నంటెదవు. వద్దు! నా కెంగిలి అసహ్యము. ఈరోజున పరుగుపందెములో నిన్ను ఓడించగలనుసుమా!” అని సౌందర్య రాశియగు నాబాల పకపక నవ్వినది.

ఇంతలో మొగలిరేకువంటి శ్వేతోరగి యోర్తు ఆ బాలకడకు వేగాన ప్రవహించుచు వచ్చినది. దానిని చూడగనే అర్జునుడా కన్యకా హస్తాల నుండి నేలకుజారి, ఓంకారరూపమై ఆడజొచ్చెను. ధవళఫణియు, గ్రక్కున నా యువతిపై కెగబ్రాకి ఆమె మూర్థాననుండి ఫణము క్రిందకువాల్చి యాబాలిక ముక్కు బుగ్గలు, పెదవులు, గడ్డము, నాల్కలనంట సాగెను.

చంద్రకిరణమువలె మిలమిలలాడు స్నిగ్ధస్విన్నాంగముతో నాభుజగి ఆ జవ్వని లేతపొన్నాకు చెవికడ సంగీత స్వనాన బుసకొట్ట నారంభించినది. బాలికయు “ఏమి ఉలూపీ! భర్తపై నేరాలుమాని ప్రేమవాక్యాలు పలుకుచున్నావు! ఆహా! మూడునాళ్ళ కలహపు ముచ్చట నేటితో తీరెనేమి? ఏది! నాయెదుట ఒకరినొకరు కౌగిలించుకొను “డని కోకిల పులుగుపలుకుల కుహుకుహూలాడినది. తక్షణమే యా పన్నగి క్రిందకుజారి అర్జునుని మెలివేసికొనిపోయినది.

ఆ మందిరమునం దెల్లయెడల విషోరగములు భయంకరములై తిరుగాడుచున్నవి. పాములు నివసించుటకు గోడలపొడుగునను మట్టితో కృత్రిమ వల్మీకములు నిర్మింప బడినవి. ఆ బాలిక అందలి నాగములతో మంతనమాడుచు, నాడుకొనుచు ఒక ముహూర్తకాలము వినోదించి యా మందిరము వెల్వడినది.

ఒక కక్ష్యాంతరముదాటి యామె ఉద్యానవనవాటిక ప్రవేశించెను. అందు నాభితీగెలు కంచెలయందు దట్టముగా నల్లికొని ఎర్రని పుష్పములు పూచి యున్నవి. శృంగి, మదనబేరి, ముష్టి విపక్షీర విసబొద్ది వృక్షములు అచ్చటచ్చట తమ విషపత్రముల నాడించుచున్నవి. అది భయంకర సుందర వనవాటిక. అది మృత్యుబాలికా నృత్యరంగము.

ఆ వనాంతమున వివిధవర్ల శిలలతో నిర్మింపబడిన జలాశయము నాకృశాంగి సమీపించి విగతవస్త్రయై, యందు దుమికి, యీదులాడజొచ్చినది. ఆ నీరములందు అగ్నికీలాసదృశములు నగు వివిధ విషాదులు సమ్మళితము చేయబడియున్నవి.

ఆ తన్వంగియందు గాలికి నూగులాగు బడబానల జిహ్వవలె నీదు కొన్నది. పిల్లిమిరెములు, బల్లటీలు కొట్టినది. ఆ విష దిగ్ధనీరముల బుక్కిట బట్టి పై కెగ జిమ్మినది. మునిగి తేలినది. ఓలలాడినది.

జలక్రీడలైన వెనుక సువ్వునలేచి పదునెనిమిదేళ్ళ చుఱుకు ప్రాయంపు టద్భుతసౌందర్య మొలుక బోసికొనుచు మెట్లెక్కిగట్టునకు వచ్చి, కురుల తడియార్చుకొని ద్విగుణీకృత దేహకాంతితో వెలుగుచు, కాటువేయబోవు పామునోటి కోరవలె తళతళమన్నది.

ఆమె సౌందర్యము సువాసనాలహరు లెగబోయు తరులగర్భములోని అగ్నివంటిది. తియ్యని విషము. విద్యున్మాలినీ విలసితము, పాయము తాల్చిన వ్యాఘ్రరాణి, పదునుపెట్టిన నిశితకృపాణము.

కుంతలములను వలిపెముతో తుడుచుకొనుచు దిసమొలతో నొయారముగ నడుగులిడుచు ఆ వనవాటి నంటియున్న భవనమార్గమును జేరినది. ఆమె దేహచ్ఛాయ తప్తకాంచనము. నల్లనై విడబారు కేశభారము జానువులవరకు వ్రేలాడినది.

అడివి బాపిరాజు రచనలు - 2

• 10 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)