పుట:Himabindu by Adivi Bapiraju.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరువములు తొంగిచూచు ఆమె వక్షోరుహద్వయము తరుణకదంబము పూచిన తొలిపూతగుత్తులు. ముగ్ధత్వమువీడని యా బాలికా తనూరేఖలు అపశ్రుతిరహిత రాగమాలికా మోహనతరంగములు. మత్సాకారములై దీర్ఘములైన యామె లోచనాల కలలు తిరగవు. అవి నిశితసారాచ ముఖధగద్ధగితములు. ఆమె అధరోష్టములు మథురములు, కరుగని అరణ్యక బింబ ఫలములు, నాభి కుట్మలములు.

ఆ బాల యభ్యంతరగృహమునకు విసవిసజని, సన్నని దుకూలము ధరించి స్తనవల్కలము జుట్టుకొని నగలుదాల్చి నాభీగంధకదంబితమగు పచ్చి సాంబ్రాణిబంక పొగవేసుకొని కుంతలా లార్చుకొనుచుండ నామందిర కవాటము తెరచుకొని పండువంటి యొకవృద్ధతపస్వి స్థౌలతిష్యులు లోనికి వచ్చిరి. మిసమిసలాడు నా బాలికాసౌందర్యము ఆపాదమస్తకము గమనించుచు, చిరునవ్వు మోమును వెలిగింప నాతడు చేరవచ్చినాడు.

“తాతయ్యా! నాకేమి తెచ్చినారండి!” యని యామె యాతని కౌగిలిలోనికి వ్రాలినది.

“కన్నతల్లీ! నీవు నా కోర్కెలీడేర్చు దివ్యముహూర్తము సమీపించుచున్నదిసుమి. అప్పుడు నీ ఇష్టమువచ్చినట్లాడుకొని, నాశనమొనర్ప అమూల్యము, సజీవమూ నగు నాటవస్తువు నీ కర్పించెదను. ఈలోన ఇతర వస్తువులు నీకు వలయునవి ఒసగుచుంటినిగాదా!?”

“ఆ వస్తువు అందముగా నుండునా తాతయ్య?”

“ఆ సౌందర్యమునకు దేశదేశములు తలలొగ్గుచున్నవి.”

“ఎప్పుడా ముహూర్తము తాతగారూ?”

“బ్రహ్మ సరస్వతిని విద్యాతేజఃపుంజముచే సృష్టించినాడు. కమలాక్షుడు కంటకుల నిర్మూలించుటకై చక్రమును సూర్యరజముచే త్వష్ట కల్పించినాడు. పరివేదనాతప్తమగు నాహృదయతాపమువోసి నిన్ను పెంచికొన్నాను. తల్లీ! నీ కన్నులు జాజ్వల్యమాన హల హలధారలై పోవుగాక! నీవక్షోజములు ప్రళయాగ్ని స్పులింగకలశములౌగాక! నీ దేహము జృంభా విస్ఫురన్మృత్యు ముఖదంష్ట్ర యగుగాక! ఆ దివ్యముహూర్తము ఇదిగో వచ్చుచున్నది. వచ్చుచున్నది తల్లీ!”

అతని కన్నులు ఫాలము భయంకరములగు కాంతులచే ప్రకాశించి పోయినవి. వణుకుచున్న అతని చేతులు ఆమె మూర్దమును తడివినవి.

ఇంతలో “ఘణఘణ” యొక జేగంట మ్రోత వినవచ్చినది.

ఆ తపస్వికి మెలకువవచ్చి తీవ్రత తగ్గిన కంఠముతో “అమ్మా! పూజా వేళయైనది. పరమశివుడు యోగనిద్రనుండి లేచి నా పూజకై నిరీక్షించుకొనియున్నాడు. నేను వెడలెద” నని పలికి రూపొందిన బ్రహ్మవిద్యవలె నున్న యాతడా గదినుండి వెడలిపోయినాడు.

తాతగారు వెడలిపోయిన వెనుక ఆ బాలిక వేరొక కవాటమును తెరచుకొని వివిధములగు ఆటవస్తువులున్న వేరొక మందిరమునకు బోయినది.

ఆ బాలిక బొమ్మలతో నాడుకొనుచు, కూనిరాగముల తీసికొనుచు ఆ క్రీడలో మునిగిపోయినది. వ్యాఘ్ర సింహాదులు కురంగాది జంతువుల తినుచున్నట్లు, దేవి రాక్షసుల వధించుచున్నట్లు కీలుబొమ్మ లనేకములందుగలవు.

బొమ్మల పెళ్ళిళ్ళు, బిడ్డబొమ్మల గుజ్జనగూళ్ళు ఆ పాప చిన్ననాటి నుండియు నెరుగదు. ఆమె ఆట పాట లన్నిటిలో వీరభయానకరౌద్రములే మెదిపి యుంచిరి. ఆమె చూపులకు విలయపయోద నీలిమలు కాటుకలైనవి. ఆమె యూర్పులు మృత్యు నిశ్వాస భుగభుగలతో సహాధ్యయనము చేసినవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 11 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)