పుట:Himabindu by Adivi Bapiraju.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 నొందించికొనుటయు గమనించుచునే యున్నాడు. మల్లయుద్ధవిశారదులలో మేటి, ఉప సేనానాయకులలో నుత్తముడు నగు సోమదత్తుని వ్యాయామ వనములందు కుమారుడు సుశిక్షితుడై ప్రఖ్యాతి నందుచున్నాడనియు ఎరుంగును. అయినను తన కుటుంబము పూర్వకాలము నుండియు శిల్పవిద్యయందు యశము సముపార్జించుకొనుచున్నది. ఆ దివ్యవిద్యను వదలి పామరజనోచితమగు వీరవిద్యయందు కాలము గడుపుట యంతయవివేకము! ఆత్మరక్షణమునకు ఆర్త రక్షణమునకు యుద్ధాశక్తి అవసరమగును. అంతమాత్రమే.... అయిననిప్పుడు....?

“బాబూ! నీవు దిగులుకొనకు; నిన్ను వీరవ్యవసాయమునుండి మరల్చు పిరికిమానిసిని కాను. మనవిద్య భగవత్ప్రీతికరము, సర్వోత్కృష్టము. తథాగతుని గాథలు శిల్పంలో రూపించి తనకు ద్రష్టకు నిర్వాణ మార్గ సోపానములు కట్టుశిల్పి యెక్కడ, వీరవిద్య లెక్కడ? భిక్షులువాగ్ధార బోధించిన ధర్మమునే, మనము టంకణ ధారతో ప్రసరింప చేయుదుము.”

ధర్మనందుల ధర్మపత్నియగు శక్తిమతి భర్తనుజూచి “బాబు శిల్పదీక్ష మీకు తెలియదుకాబోలు. చిన్ననాటి మీ శిల్పవ్యసనమంతా జ్ఞాపకముచేస్తూ వుంటాడు. పోలిక లెక్కడికి పోతవి! అభయబాహు మహారాజుతో మీరుచేసిన మల్లయుద్ధ వినోదాలు జ్ఞాపకము లేవూ?” అని పలికినది.

సువర్ణ శ్రీజనకుని పవిత్రభావము నిముషమున ద్యోతకము చేసికొనెను. కాని శకటాధ్యక్షులగు మహాశ్రీకి తన విజ్ఞాపనపత్రమును సోమదత్తులవారు పంపియుండిరే! ఇప్పుడు వెనుదీయుటకన్న బేలతన మేముండును?

కుమారుని మోము తిలకించుచున్న ధర్మనంది “వత్సా! సరియే, కానిమ్ము. మనకుటుంబమున వెన్నిచ్చినవా డింతవరకు జన్మింపలేదు. నీవు క్షేమముగ విజయివై వచ్చెదవుగాక!” అని నయనములు ప్రకాశింప పలికి, భోజనము పూర్తిచేసెను.

సువర్ణశ్రీ కుమారుడును పై కుబుకు సంతోషము నడంచుకొన ప్రయత్నించుచు పితృభక్తి పూరితములగు నశ్రుబిందువులు నేత్రముల దొలక భోజన మెట్లెట్లో చేసెను.


3. సేనాధికారులు

మదర్శి మధ్యమ వర్చస్వి. అయిదడుగుల ఎనిమిదంగుళముల పొడవు. కండలుదేరిన అవయవస్ఫుట రేఖలతో రాతివిగ్రహమువంటి కఠినదేహముకల పోటుమానిసి. అనేక యుద్దముల ఆరితేరిన బంటు. మదించిన మగధ మహిషమువలె మత్తిల్లియుండి, వాహినీపతులలో నుత్తముడై, మహారధుడై యిరువదిరెండువర్గాల పడుచుప్రాయంపు వీరుడై వెలయువాడు.

ఉత్తమాశ్వారూఢుడై, ఎడమచేతనున్న కళ్ళెము గుర్రము మెడమీద వదలి, మీసాలు మెలికలు తిప్పుకొనుచు, జనుల కేలుమోడ్పుల చిరునవ్వుతో నందికొనుచు ఒక నా డాతడు ధాన్యకటక నగరవీధుల హుటాహుటి స్వారి చేయుచు కోటనానియుండు యోధాగార గోపుర ద్వారముకడకు బోయినాడు. అచ్చట కావలిగాయు దళపతికి సంకేతము దెలిపి స్వారి చేయుచునే లోపలికి బోయెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 6 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)