పుట:Himabindu by Adivi Bapiraju.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధాన్యకటక నగరమునందు కోటలో రెండును, నగరములో రెండును, నగరము వెలుపల పదియు యోధాగారము లున్నవి. కోటలోని యోధాగారములు రెండును పెద్దవి. ఒక్కొక్కదానిలో అయిదువేల కాల్బలమును, వేయి గుర్రములును, వేయిమంది అశ్వికులును, అయిదువందల ఏనుగులును, వేవురు గజారోహకులును, మావటీలు వేవురును, అయిదువందల రథములును, అయిదువందల రథికులును, సారధి సహస్రమును, చక్రరక్షకులు వేవురు నుందురు. దళపతులు, ముఖపతులు, గణపతులు, వాహినీపతులు, చమూపతులు, ఉపసేనాపతులు, సేనాపతులు అని సైన్యాధికారులు తరతమములై యుందురు. నాలుగు ఏనుగులుగాని, నాలుగు రథములుగాని, పదిరెండు గుర్రములుగాని, ఇరువదిమంది కాల్బంటులుగానీ-ఏదియైనను దళమనబడును.[1] మూడు దళములు ఒకముఖము, పది ముఖములు ఒక గణము, మూడు గణములు ఒక వాహిని, మూడు వాహినులు ఒక చమువు. నాలుగు చమువులు ఒకసేన అని ఆంధ్ర సైన్యములు విభజింపబడినవి. ఒక్కొక్కసేనకు ఒక్కొక ఉపసేనాని అధిపతి. సేనాపతి రెండు సేనలను నడుపగలడు. సర్వ సైన్యములకు నాయకుడు సర్వ సైన్యాధ్యక్షుడు.

యోధాగారము సమచతురస్రమై, ఆవరణషట్కముతో నొప్పియుండును. నడుమనుండు ఆవరణలో సేనానాయకశాలయున్నది. ముఖపతులు సైనికులతోపాటు దళపతులు ఉత్తమ గృహములలో నివసింతురు. గణపత్యాద్యుత్తమ సేనాధికారులు నగరములో భవనములలో నివసింతురు.

సమదర్శి అట్లు ఆవరణలన్నియు దాటుచు పోయి సైన్యాధికారిభవనము ముంగిట నిలిచినాడు. అనేక సైన్యాధికారు లీతని చుట్టునుమూగిరి. పరుగిడి వచ్చిన అశ్వరక్షకుని చేతులలోనికి కళ్ళెమును విసరి, గుర్రమునుండి ఛంగున నురికి, “ఆంధ్రవీరా!” యని తన్ను సంతోషమున సంబోధించు స్నేహితుల జూచి నవ్వుచు, వారితో లోనికిజని, ఉచితాసనము నలంకరించినాడు.

“రేపటి మహోత్సవములో విజయము సమదర్శిది” యని ఆనంద వసువు వాక్రుచ్చెను.

“సార్వభౌములకు సమదర్శిపై అందుకే గదా అంతప్రీతి” యని ప్రభాతశూరుడు పలికినాడు.

సైన్యాధికారులు తళతళమను వెండిబంగారు చెక్కడపురేకు పొదిగిన తామ్ర శిరస్త్రాణములు తలలందును, మెడలో హారములు, భుజముల కేయూరములు, మొలల పట్టుకోకలు అలంకరించికొని యుండిరి. వారిలో ఆశ్వికులకు కూర్పాసములును[2], రథికులకు కంచుకమును[3], పాదచారులకు వారవానకములు[4], గజపతులకు దేహత్రాణములును, దేహమునకు విడివిడిగా ధరించు లోహపుగొట్టములు గలవు. కంఠత్రాణములు, నాగోదారికములు[5] అందరును ధరింతురు. ఆ పరాక్రమమూర్తుల నవలోకించినచో ఆంధ్రసైన్యములు సకల భారతవర్షమున నేల దుర్జయములో తెల్లమగును.

వీరలోకమంతయు వివిధాసనముల నుపవిష్టమైనది.


  1. ఒక ఏనుగు = 1 రథము = 3 గుర్రములు = 5గురు బంటులు
  2. నడుము వరకు నుండు ఇనుప చొక్కా
  3. మోకాళ్ళవరకు కప్పు గొలుసుల కవచము
  4. చీలమండలవరకు వ్రేలాడు కవచము
  5. చేతులకు తొడుగుకొను ఇనుపచేయి

అడివి బాపిరాజు రచనలు - 2

* 7 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)