పుట:Himabindu by Adivi Bapiraju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందసమునందుంచెను. ఈ సాయంత్రమునకిది పూర్తి కావచ్చును. అప్పుడే ఆరు ముహుర్తములైనది. కోటలో భేరియు, స్తూపఘంటయు మ్రోగించినారు.

“రెండు మెతుకులు నోటవైచుకొని వచ్చి....” అను ఆలోచనములాతని హృదయమున పరువులిడినవి.

ఆ మందిరమం దెచ్చట చూచిననూ పాలరాతి విగ్రహములు వివిధ శిల్పావస్థలలో నున్నవి. చిత్రశోభితములై తోరణయుతములైన ద్వారకవాటములతో వర్ణమనోహరములైన కుడ్యములతో వర్ణములు కలుపుకొను పాత్రలతో, తూలికాది పరికరములుంచు మంజూషలతో, శిల్పశాస్త్ర తాళపత్ర గ్రంథములుంచిన పేటికలతో నా మందిరము విచిత్ర సౌందర్యము తాల్చినది.

మిసిమి వయస్సులోనున్న ఆ బాలశిల్పి అటుల నాలోచనాధీనుడై యుండ, ఇంతలో నొకజవ్వని ఇంటిలోనికి బోవు గుమ్మముకడకు వచ్చి “బాబూ సువర్ణ! భోజనమునకు రావా? మీ తండ్రిగారు కనిపెట్టుకొని ఉన్నారు. మీ అమ్మగారు వడ్డించుచున్నారు” అని పిలిచెను. బాలకుడు ఉలికిపడి.

“ఇదిగో, అందుకే లేచితిని, ఆరవ ముహూర్తనాదము వినబడినది ఇప్పుడే కాదా” అనెను.

“ఒక నాళిక పైగా దాటినది బాబూ!”

“ఏమిటీ! నాయనగారు బుద్దారాధనచేసి నా కొరకు కని పెట్టుకొని యుందురు. ఎంత మందమతిని! పాద ప్రక్షాళనముచేసి ఉడుపులు ధరించుకొని వచ్చెదను.” అనుచు నాతడు త్వరత్వరగా దొడ్డిలోనికి పోయెను.

ఇంతలో మహాలి మహానసగృహమునకుబోయి

“అమ్మా! కుమారుడు పాదప్రక్షాళనముచేసి శుభ్రవస్త్రములు ధరించి వచ్చుచున్నాడు. అది యెచ్చటి శిల్పదీక్షయో కాని మన సువర్ణకుమారునికి బాహ్యస్మృతియే ఉండదమ్మా!” అని పలికినది.

“అయ్యో, చిన్నతనాన వారును ఇంతే. ఆ తండ్రికి కొడుకుగాడూ! పోలిక లెక్కడికి పోవును! వారి జపమైనది, నా వడ్డనయు పూర్తియైనది. అబ్బాయివచ్చి కూర్చుండెనేమో చూడు, వానికి ఇష్టమని మామిడికాయ పచ్చడి చేసితిని.”

మహాలి భోజనాగారములోని కడుగిడి చూచి, వెనుకకువచ్చి, “అమ్మా! వచ్చి కూర్చున్నాడు. నేను పోయి, అమ్మాయిలకు స్నానాదికముల కేర్పాట్లు చేసెద” నని యామె గృహమున వేరొకభాగాన కేగెను.

తండ్రి కొడుకు లిరువురు భోజనము చేయుచుండిరి. తటాలున ధర్మనంది పుత్రుని గని, “రేపు సార్వభౌముని జన్మదిన ఖేలనోత్సవములకు వెళ్ళుదువా?” అని అడిగెను.

“చిత్తము,”

“ప్రదర్శనములో పాల్గొనుచుంటివా?”

సువర్ణశ్రీ మాట్లాడలేదు.

“పందెగాళ్ళలో నొకడవని వింటిని. బాబూ! శకటవేగ పరీక్షకు నీవు వెళ్ళుటా! నీవు ఎడ్లబండి తోలడ మెపు డలవరచుకొంటివిరా!”

సువర్ణశ్రీ కుమారుడు భోజనము చేయుటమాని బంగారుకంచా న వ్రేలు రాయుచుండెను. ధర్మనంది తన తనయుడు విద్యాసక్తితోపాటు దేహబలము వృద్ధి

అడివి బాపిరాజు రచనలు - 2

• 5 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)