పుట:Himabindu by Adivi Bapiraju.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమబిందు ఏదియో ధైర్యము వహించియే యుండెను. సువర్ణశ్రీ తనకు పరపురుషుడై పోయినాడా? అతనిపై ప్రేమ నెట్లు నాశనము చేయగలదు? ఆనందుల వారంతగా ధైర్యము చెప్పినా రేమి? వారిమాటల కర్థమేమి? ఆ బాలకేమియు పాలుపోవుట లేదు, ఎటుల నా దివ్యవిగ్రహమును తన హృదయమునుండి చెరిపివేయగలదు? తాను చిత్రములు లిఖించుట నేర్చుకొన్నది. కాని ఫలకముపై లిఖించిన చిత్రము నెవ్వరు తుడిచివేయగలరు? ఆ చిత్రముపై సున్నము పూయవలెను. ఆ సున్నముపై వేరొక బొమ్మ వేయవలయును. కాని వెనుక అణగియున్న చిత్ర మేమగును?

హృదయమున అణగియున్న చిత్రము మరియు సన్నిహితమై జీవితమునే దుర్భరముచేయును. ఏల యాతడు తనజీవితనాటకరంగమున నాయక పాత్రగా ప్రవేశించినాడు? తను మహారాణి యగునా? అరాజక మగు హృదయరాజ్యంతో తానే రాజ్యమునకు రాణి యగును? తనరాజ్యము సువర్ణశ్రీమయము. నాగనిక సంతోషము అద్భుతానందము. తనకు సువర్ణుని మరియు సన్నిహితునిగ నొనరించినది.

తన కుబేరవైభవము కాల్పనా? ఆ వైభవము తనకేమి యీగలదు? అది తన సువర్ణుని దూరము చేసినది.

హిమబిందు నాగబంధునికను పదిసార్లు రప్పించుకొన్నది.

“నాగూ, నేను మీ ఇంటికిరాలేను నన్ను మా తండ్రి మహారాణి నొనరించునట. నామీద ఒట్టు. ఎవ్వరితో నా రహస్యము చెప్పకు. నేను బ్రతికి ప్రయోజనము లేదు.”

“వెఱ్ఱిదానా! నీవు నావదినవు. కొనఊపిరితో నయినా నీకును, నీ కయిష్టమగు మహారాజ్ఞిత్వానికి నేను అడ్డుపడెదను. నా అన్న మహారాజుల కన్న అధికుడు. అతడు మంజుశ్రీ దేవుడే. ఆతడు నిన్ను పూజించును. నీమాట ఆతనికి మంత్రమైనది. అన్నయ్య నీ దిగులుతో సగమగుట చూచి, మా చిన్న మేనమామగారి ఇంటికి మా అమ్మ పంపినది. వెళ్ళి అక్కడ నేమియూ తోచలేదని మరియు చిక్కి నిన్ననే మాచెల్లితో తిరిగి ఇంటికి వచ్చినాడు.”

“బొమ్మలు వేయుచుండెనా?”

“బొమ్మలు లేవు, బూడిదలులేవు. పైన లోన నాతనికి దారుణపు వేడి!”

“మా తల్లి నన్నుకన్న రెండేడులకు నిర్యాణమందినది. పుణ్యాత్మురాలు. నా కా పుణ్య మెప్పుడో!”

“చాల తెలివైనదానవుకదూ! ఇదా నీయవనరక్తపు ధైర్యము!మా భారతాంగన లట్టి వెడగుమాట లనరు. బాణునికొమరిత అనిరుద్ధుని తెచ్చికొన్నది. నీవును నీ అనిరుద్ధుని తెచ్చుకొమ్ము. ”

కొంతసేపు వారట్లు మంతనమాడిన వెనుక నాగబంధునిక వెడలి పోయినది.

హిమబిందు బాలనాగితో తోటలోనికి బోయెను. ఇంతలో చెలియకర్తుకవచ్చి “అమ్మా! హర్షగోపులు తమదర్శనము కోరుతున్నారు” అనెను.

హిమబిందు మోమున విషాదపూరిత మగు దరహాస మొదవినది.

“నాజన్మ మెట్లును దుఃఖభాజనమైనది. బాలనాగీ నీ వైన సుఖ పడవే!” యన్నది.

బాలనాగి మోమున సంతోషము, విషాదము, కోపము అన్నియు తెర ఎత్తిన నాటకపాత్రలైనవి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 147 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)