పుట:Himabindu by Adivi Bapiraju.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రియగుటయు నామె మారిపోవును. ఆమె ఆనందమూర్తి యగును. శృంగార రసాధిదేవత యగును. ఆ దంపతుల ఆనందము దేవతలకే కనులపండువై వికసించి పోవును.

అది వేసవిదిన మగుటచే తోటలో వకుళవృక్షపునీడలో భార్య నులకమంచముపై పక్కవేసి, స్నానముచేసి, శుభ్రవసనములు ధరించి రా వెడలిపోయినది. దుగ్గన్న సోగ మీసములు త్రిప్పి, మందహాసముచేసి, మంచముపై పాదములు ముడుచుకొని గాఢనిద్ర నభినయించుచుండెను.

ఇంతలో బాపిశ్రీ తెల్లనిచీర[1] ధరించి, పూవుల ఉపవీతము[2] వలెవాటువైచికొని, స్తనవస్త్రము చుట్టి, మల్లెపూలు జడముడిని తురుముకొని, వెండి బంగారు నగలు తాల్చి రూపొందిన మోహదేవతవలె నాతనికడకు వచ్చినది.

ఆతడు గాఢనిద్ర యందుండెను. మంచమున నా పడుచు పండు కొనుటకు స్థలము లేదు. ఆమె మంచముదాపుననిల్చి, అతనిపై వంగి ఒక పదినిమేషముల కాలము పరిశీలించెను. ఆమె తమిపట్టలేక అతని బుగ్గపై రెండు ముద్దుల నాటినది. ఆతని ఒళ్ళు ఝల్లుమన్నది కాబోలు, ఆమె మందహాసము చేయుచు.

“ఆళి అపసుత్త అవిణీ మీళి అచ్ఛ
దే సుహ అమఝ్ఘ ఓ ఆసం
గండపరి ఉంబణాపుల ఇ అంగం
ణపుణాచిరా ఇస్సం”

,

(గాథాసప్తశతి)*[3]

అని కోకిలకంఠమున తీయగా పాడినది. ఆ పాటకు కరిగిపోయి, దుగ్గసామి గబుక్కున లేచి, భార్యను కౌగలించుకొని, మంచము పైకి లాగి ఆమె మోముపై ముద్దులవర్షము కురిపించినాడు.

***

ఈ దృశ్యమంతయు గోడప్రక్క వటవృక్ష మెక్కియున్న విషకన్యక పరిశీలించుచునే యున్నది. ఆ యాకుజొంపములలో ఆమె నెవ్వరు కనిపెట్టలేదు.

సాయంకాలమగునప్పటికి దినదినము ఆశ్రమగృహమునుండి ఆమె మాయమగునది. ఆగస్తియు, గగనియు, కాశ్యపియు ఆమెకై ఎన్ని సారులోవెదకి వేసారినారు. ఏమైనది? ఆమెకు తిరస్కరణీవిద్య యున్నదా? ఆమె తిరోధానమొందు విషయము స్థౌలతిష్యునకు వారిరువురుకూడ చెప్పలేదు. అట్లు మాయమై రాత్రి మొదటి యామము ముగియలోపలనే ఆమె పామువలె చప్పుడుకాకుండ నా కొమ్మలనుండి జారి ఏ లాగున పరువిడి వచ్చునో ఆశ్రమగృహములకడ ప్రత్యక్షమగును.

దుగ్గసామి బాపిశ్రీల ప్రణయగాధ ఆమెహృదయమున హత్తుకొనిపోయినది. రాత్రియంతయు ఆమె కనులుమూసి కదలికలేక నిద్దుర నటించుచు మేలుకొనియే యుండును

  1. నడుమువరకే
  2. విడిపయ్యెద
  3. దొంగనిద్దురవాడ! ముద్దుగొనినట్టిచెక్కిళులరేగు పులకల చెలువు గంటి ఏల కనుమూసికొనెదు? చోటిమ్ముకొంత మసలనుండనులె మ్మిట్లుమర నెపుడు.

    (రా. అనంతకృష్ణశర్మగారి భాషాంతరీకరణము)

అడివి బాపిరాజు రచనలు - 2

• 138 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)