పుట:Himabindu by Adivi Bapiraju.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విచ్చీవిచ్చని ఆమెమనస్సును ఆ పడుచుదంపతుల ప్రేమ విప్పారుచున్న కుసుమముల సువాసనలవలె పొదివికొన్నది. శీతలవాయువులు చేమంతికొమ్మలకు పులకరము కలిగించి మొగ్గలదొడిగించును. మలయానిలము మల్లెపొదలకు స్పందనము కలిగించి తెల్లనికుట్మలముల వరమిచ్చును. చంద్రుని చల్లని జ్యోత్స్నలు కలువకన్నెహృదయ ముప్పొంగజేయును. విషబాల హృదయమున విషము విరిగిపో నారంభించినది.

తానును ఆ బాపనమ్మవంటిదే. ఆ కాపుబడుచు ఉలూపి అర్జునునితోవలె దనపురుషునితో అలమికొనిపోవుచున్నది. తానును అట్టిదేకదా! తన కెట్టి పురుషుడు వచ్చునో!

ఇంతలో ఆమెకు చల్లనివస్తువులమధ్యనిప్పు దాగుకొనియున్నట్లు ఒక భయంకర విషయము జ్ఞప్తికివచ్చినది. ఆ కర్షకబాలిక కౌగలించినట్లు తాను దనపురుషుని కౌగిలించినచో ఆతడు దగ్ధమైపోవలసినదేకదా!

చా వనిన ఏమో ఆమె యెరుంగును. తాను మృత్యురూపము. మనుష్యులను నాశనము చేయుటకే తానుద్భవించినదికదా! ఆమె గజగజ వణికిపోయినది.

25. చైతన్యశక్తి

విషబాలిక ప్రతిష్ఠానము చేరుకొన్న నాటినుండియు మాటలాడదు. నవ్వు ఆమె ముఖమున నృత్యము సేయదు. ఆమె కన్నులలో ప్రసన్న రేఖలు ప్రత్యక్షముకావు. ఆమెలో కుములుచున్న బాధ నెమ్మదిగా రాజు కొనుచున్నది. ఆమె కన్నులలో ఏవియో మబ్బులు ఆషాఢమేఘములవలె ఆవరించియున్నవి. ఆమె పెదవులలో పండని బింబఫలములో, పూచని కాశీరత్నములో, ఉదయించని ఉషస్సులో తొంగిచూచుచున్నవి.

విషబాల ఒకచోట ఒదిగి కూర్చుండును. ఆమె మోకాళ్ళు ముడిచి వానిపై మోముంచి, రెండుచేతులు మోకాళ్ళకు చుట్టి, కన్ను అరమూతలు వైచి, చైతన్యరహిత మగు బొమ్మవలె నాళికలు నాళిక లట్లు కూరుచుండును.

గురుదేవులు స్థాలతిష్యులవారి సంకల్పము విషబాలను మహామారణ యంత్రము నొనరించుచున్నదని, గగన్యాదికాపాలిక లూహించుకొని భయావృతహృదయలైరి. తాముకూడ ఆమెను దరిచేర నలవితప్పి, గురు ప్రభావమున ఈ బాలిక మృత్యుదేవతా విస్ఫారితభయంకరవదన యగుచున్నదని ఆ కాపాలికలు నిశ్చయించుకొనినారు.

ప్రతిష్ఠాననగరాశ్రమమునకు వచ్చిన మరుదినము మధ్యాహ్నము విషకన్య గోదావరీతీరమునకు బోయి, రాళ్ళు విరజల్లినట్లున్న యా గట్టుదిగి, నదీగర్భమున బండరాళ్ళమధ్యమున సెలయేరువలె ప్రవహించు నా నదీమతల్లిచేరువ నొకశిలపై కూరుచుండి, నీళ్ళలో కాళ్ళుంచి, ఇటు నటు ఆడించుచును, నీలములై, స్వచ్ఛములై ప్రవహించునా నీటిలోతుల పరిశీలించుచు నాలోచనారహితయై యుండెను.

ఆ నీటిలో నంత నొక విగ్రహ మామెకు ప్రత్యక్షమైనది. ఆ విగ్రహము కిరీట, కేయూర, కర్ణకుండల, హార, కంకణాది భూషణభూషితము. ఆ మూర్తి సమున్నతము. ఆ మూర్తిముఖముమాత్ర మామెకు గోచరముకాలేదు.

ఆ సమయముననే స్థౌలతిష్యుడు శ్రీముఖసాతవాహనుని నాశనము గోరి జపించుచున్నాడు.


అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 139 •