పుట:Himabindu by Adivi Bapiraju.pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రులకు కూరగాయలన్న నెంతయో ప్రేమ. అరటులు విస్తారముగ పెంచుచుండిరి. ఆంధ్రదేశమునం దా దినముల నున్న అరటి జాతులు మరెచ్చటను లేవు. వార్తకకి (ములగ) నాగబలము (బీర) పడోలకము (పొట్ల) దార్వికము (బెండ) బింబ (దొండ) వాటకము (బుడమ) దృక్షగన్ధ (బొద్ది) సోమవల్లరి (పొన్నగంటి) అంబష్టము (పులిచింత) సహస్రవేది (పుల్లప్రబ్బలి) జీవని (పాలకూర) పలాండము (నీరుల్లి) లశునము (వెల్లుల్లి) కారవేల్లము (కాకర) కులకము (చేదుపొట్ల) కుష్మాండము (గుమ్మడి) కర్కటి (దోస) తుంబి (సొర) కందగండీరము (వంగ) లంబనము (తీగబచ్చలి) ఉపోదకి (దుంపబచ్చలి) మూలకము (ముల్లంగి) హిలమోచికము (చిలుకకూర) వాస్తుకము (చక్రవర్తికూర) నారికేళము - ఈ కూరలన్న ఆంధ్రులకు ప్రాణము. ఆ నాడును ఆంధ్రులు కర్ణికారము (గోగు) ను ప్రియమార భక్షించువారు. కందమూలములలో కంద, పెండలము, చామ విరివిగ తినువారు.

కృష్ణయొడ్డున ఆ తోట పెంచు రైతు చిన్నవయసువాడు. ఆతని తోటలో అరటిచెట్లు, పొట్ల, బీర, దొండపాదులు, అలచందజాతులలో చేరిన పెద్దచిక్కుడు పాదులు విరివిగ నుండెను. ఆతోట అర్థనివర్తనమునకు తక్కువగనే యున్నది. అతని పేరు దుర్గయ్య. దుర్గసామి అనియు బిలుతురు. అతని భార్య కాపురమునకు వచ్చి కొన్ని మాసములైనది. ఆమె పేరు బాపనమ్మ. బాపిశ్రీ యనియు పిలుతురు. కర్షకుల బాలికలందరు అందకత్తియలు. అందు బాపనమ్మ మరియు నందకత్తె.

దుగ్గ సామి ఇల్లు వారితోటలోనే యున్నది. భార్యయనిన యాతని ప్రేమ కృష్ణవేణి పొంగులవలె గట్లుపొర్లి ప్రవహించుచుండును.

ఒకనాడు భార్యాభర్తలిరువురు సాయంకాలము సరససల్లాపము లాడుచుండిరి. దుగ్గసామి గంభీరమైన కంఠమెత్తి,

అణ్ణాస ఆ ఈఁరేంతీ తహసుర ఏహరిస
విహసి ఆ కవోలా
గోసేవి ఓణ అముహి అహసేత్తిపి ఆం
ణ నధథిమో (గాథాసప్తశతి)*[1]

అని నవ్వినాడు. బాపిశ్రీకి కోపమువచ్చి ఇంటిలోనికి పారిపోయినది. చీకట్లు విసవిస పైకెగబాకి వచ్చినవి. భర్త పాటపాడినట్లు ఆమెకు పగలు అమితమగు సిగ్గు. వంచినతల ఎత్తిఎరుగదు. భర్త మాటలాడించినను మాటలాడదు. అత్తగారిమాటలకు అస్పష్టముగ ప్రతివచన మిచ్చును.

దుగ్గసామి అల్లరిపిల్లవాడు. అందకత్తెయగు నిల్లాలిని వదలిఉండ లేడు. ఏదేని వంకతో తనకడకు పిలుచును. ఇటునటుచూచి ఆమెబుగ్గపై ముద్దిడును. ఆమె కోపమున విదిలించుకొని పారిపోవును. పగలంతయు ఆమె మూతి ముడుచుకొనియే యుండును. అతడు మరియు నామెను అల్లరిచేయును. ఆమెకు కోపము పెరిగిపోవును.

  1. చేరి సంతసమున చెక్కిళ్ళు వికసింప ఆజ్ఞలిచ్చు రాత్రులందు నాకు పగలువంచియున్న మొగమెత్త దదె యిది అనుచు చెలిని నమ్ముటరిది చూడు.

    (రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారి భాషాంతరీకరణం)

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 137 •