పుట:Himabindu by Adivi Bapiraju.pdf/142

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నొందినది. వారిప్రేమ భగ్నమయినంతనే సువర్ణుని బాల్యమంతయు, విడిచిన వస్త్రమువలె జారిపడి పోయినది. ఆత డిప్పుడు ప్రపంచము నెదుర్కొను మనుష్యుడైనాడు.

హిమబిందు తనది గాదు. మనము ప్రేమించిన ప్రాణి మనది యేల కావలయును? ప్రేమ యింత స్వార్థకలుషితమేమి! తాను ప్రేమించి ప్రేమమయు డగుట చాలదా? ప్రేమకు యింతకుమించిన సిద్ధి యేల కావలయును? నాగబంధునిక, సిద్ధార్థినిక తన కూరిమి చెల్లెండ్రు. చెల్లెండ్రనుండి తా నేమి ప్రతిఫలము గోరును? అన్నా! యని నోరార వారు పిలుచుట చాలదా? రేపు తనచెల్లెండ్రకు బెండ్లియగును. వారు భర్తృగృహముల కేగుదురు. అందులకు దన యభ్యంతర మేమి? తనకు బాధ యెందులకు? తమ యన్నాసెల్లెండ్ర ప్రీతి కందువలన గొలతగలుగునా?

హిమబిందు శ్రీకృష్ణశాతవాహన మహారాజునకు దేవేరి యగును. ఆంధ్ర సామ్రాజ్య సింహపీఠ మధిష్టించును. తనకు సామ్రాజ్ఞి యగును. తా నా రాణికి భృత్యుడు, సేవకుడు, నమ్మినబంటు నగును. ఆ దేవి తన సేవ లందుకొనును, తన్న నుగ్రహించును. ఇంతకంటే తన కేమి కావలయును?

ఆంధ్రసామ్రాజ్ఞిని దాను శిల్పించును. కత్తి చేబూని ఆంధ్రసామ్రాజ్యము విస్తరిల్లజేసి, ఆ దేవిపాదములచెంత దాను కానుకపెట్టును. సువర్ణా! నీప్రేమ కింతకంటే నేమి కావలయును?” నేను రసభావప్రబోధితుడనై, రసపరతంత్రుడనైనపుడు సృష్టి యేల సేయవలయును? నాలో నేను ఆనందించి తృప్తిచెందరాదా? అట్లు కాదు. నా రసభావమూర్తిని నేను చూచుకొని, నాదియని చెప్పికొని మురిసిపోవలెను. ఎందరో శిల్పులు రచించిన శిల్పములుగాంచి నే నానందింతును. కాని నా కంతటితో తృప్తిలేదు. నాయానందమును నాశిల్పమున జూచుకొనవలయును. నా ప్రేమమును నాసంతానమున బ్రత్యక్షము జేసికొనవలెను.

“ప్రేమయే ఆనందము. ఆనందమే ప్రేమ. ప్రేమకు బరిపూర్ణత దాంపత్యమునందే సిద్ధించును! ఆనందమే సృష్టికి కారణ మగునేని ప్రేమ కంటే సృష్టికర్త మరియెవరు? నాశిల్పసృష్టి సృష్టియే కాదు. నాకు సాధనములైన శిలలు, వర్ణములు, టంకములు, శబ్దార్థములు నావి కావు. వానిని నావిగా నెంత మలచుకొన్నను వాని స్వభావము మాఱదు. వానిలో నాయానందచ్ఛాయలుమాత్రమే కనిపించునుగాని నేను గాన్పించను.

ప్రేమానుగృహీతుడ నగుదునేని నేను నిజముగా సృష్టికర్త నగుదును. భావైక్యము ఐక్యము గాదు. మరియొక శరీరముతో, ప్రాణముతో, మనస్సుతో నే నైక్యము సంపాదించవలెను. ఆ యైక్యావేశమున మాయిరువురివ్యక్తులు లీనమై ఆనందమున గరగిపోవలెను. ఆ యానందఫలమే సృష్టి. సువర్ణా! నీ వా భాగ్యమునకు నోచుకొనలేదు. పరమపవిత్రము, అత్యుదారము, సర్వోత్తమ మగు మధురభావము నీకు దూరమైనది.

“మనోవాక్కులచే నాతో నైక్యమందిన దేవిని నేను విడనాడు టెట్లు? వెర్రివాడా! సువర్ణా విడుచుటకు, విడవకుండుటకు నీ వెవడవు? ఆదేవి పరమానుగ్రహ మెట్లున్నదో!

“నిజము, దేవీ! మహారాజ దేవేరి యగుటయే నీ కభిమతమేని, పిత్రాజ్ఞానువర్తనమే నీకు శాంతినిడునేని నీ శాంతిసౌఖ్యములకు నే నడ్డురాను. నిన్ను శిల్పించుకొని, సేవించికొని నీకటాక్ష లేశమున కర్హుడనగుదు నేని నా కదియే స్వర్గము. నాసన్నిధానము, నా సామీప్యము, నాసేవ నీ శాంతికి భంగము గూర్చునేని నా కదియును వలదు. దేవీ! ఆజ్ఞాపింపుము. ఏ మారుమూలనో తలదాచుకొందును. నీయెదుట బడను, నీవీక్షణ

అడివి బాపిరాజు రచనలు - 2

• 132 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)