పుట:Himabindu by Adivi Bapiraju.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రా తపము జొఱరాని చీకటిగుహలలో వసింతును. నాకళాపీఠమున నున్న నీమూర్తియే నాకు జాలును. నాదేవికి మందిరమగు నా మనోగుహలోనే నేనును వసింతును. నా కా ఏకాంతము చాలును. అచటి నాదేవి నాది!”

ఇట్లు మనోరథప్రవాహముల మునిగితేలుచుండ శక్తిమతి కుమారుని కడకు బోయి “నాయనా! అన్నము తినుట మానినావు. ఏమిటి నీ హృదయమున బెంగ? మీనాయనగారు నిన్ను తక్కినవిద్యార్థులకు సహాయముచేయుమని ఆజ్ఞయిచ్చినారు. శిల్పగృహముల సమీపమునకే వెడలవు. శూన్యహృదయుడవై అటుల పండుకొనియుందువు. ఆనందుల వారికి వార్త నంపెదనన్న వలదందువు. కళ్ళు గుంటలుపడినవి. ఇంకను ముక్కుపచ్చలారని చిన్నవాడవు. ఎందుకు బాబూ నీ కింతబాధ? నామాటవిని నాలుగు దినములు కాకుళము చిన్న మామయ్యగారి ఇంటికి పోయిరాకూడదూ? సముద్రపుగాలి నీకు పడును, మీపిన్ని కంటకశాలకు రమ్మని ఎన్నిసారులో పిలువనంపినది. మీపిన్ని కొడుకు ఒక నెలదినములు అన్న వచ్చి కంటకశాలలో ఉండకూడదా? నాకు కొన్ని శిల్పమర్మములు చెప్పకూడదా? అని కమ్మ వ్రాసినాడుకద. అక్కడకుపొమ్ము. నీవిట్లు బెంగపెట్టుకొని కూర్చుండుటవలన నాకు మతిపోవుచున్నది. వరప్రసాదమువలె నీ వొక్కడవు నా కడుపున పుట్టితివి. నీస్థితిని జూచి నాకు దడవచ్చుచున్నదిరా బాబూ!” అన్నది.

“నాకు ఒంట్లో ఏమీ జబ్బులేదు, బెంగ లేదు. ఎందుకు నీవు దిగులు పడతావు అమ్మా!”

“నాకు అన్నియు తెలియవచ్చినవిరా బాబూ! అన్ని విషయములు భగవానుని ఇచ్చచొప్పున జరుగును. సుఖములు, దుఃఖములుకూడ మనలను పరీక్షించుటకే వచ్చును. ఈ జగమే దుఃఖము. ఈ జన్మ దుఃఖము. ఇచటి సంఘటనలన్నియు దుఃఖములు కావా? నాన్నా! ఈ కామదేవుని పరీక్షలో నెగ్గినవాడే భక్తుడు. నీవు తప్పక శ్రీకాకుళమునకు పొమ్ము.

“సిద్ధార్థినికను తీసికొని పోయెదను.”

“సరే, అది ముందే ప్రయాణమగును. అన్నగారిమీద ఈగ వాల నీయదు. నిన్ను గురించి అక్క సెల్లెండ్రిద్దరు ఒక్కటే వాదన. మంచి ముహూర్తము చూచి బయలుదేరి వెళ్ళండి బాబూ!”

మరునాడు సువర్ణశ్రీ చెల్లెలు సిద్ధార్థినికను తోడ్కొని, శకటము నెక్కి ధాన్యకటకము నుండి రాజమార్గమున ప్రయాణము సాగించెను. ఆ బండికి నాలుగు ఎద్దులు కట్టినారు. అది చిన్నగదియంత యుండెను. ఆ బండిగూటికి వాతాయనము లున్నవి. ఆ బండిలో కూర్చుండుటకు తూలికాసనము లున్నవి. పండుకొనుటకు ఈవ లావల పరుపులున్నవి. మధ్య పెద్దకరండములలో పళ్ళు, శక్తిమతీదేవి స్వయముగచేసిన తినుబండారము లున్నవి.

బండివెనుక రెండుజతల ఎడ్లు, ఇరువురు గోపకులుకూడ బయలు దేరిరి. ఎడ్లకు వలయు, జొన్న, చొప్ప, కందిపొట్టు, ఉలవలు, తిలపిష్టము మొదలైనవి బండి అడుగున నున్న యరలలో నుంచిరి.

ఆ ఉదయము ధాన్యకటకమున బయలుదేరి రెండవయామము సగము జరుగునప్పటికి బండినాగగ్రామము వచ్చినది. అచ్చట వారు సత్రమున దిగిరి. సువర్ణుడు సన్నని బియ్యము అన్నమువండెను. కూడ కొని వచ్చిన కాకరకాయలతో కూరవండెను. కూడవచ్చిన బుద్దగోపుడు గ్రామము లోనికి పోయి కత్తికితెగని పెరుగు పట్టుకొనివచ్చెను,

అడివి బాపిరాజు రచనలు - 2

• 133 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)