పుట:Himabindu by Adivi Bapiraju.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అది యటులుండ ఈ బాలిక మహారాణి కానెంచక, ఇంత బేలయై యీ పేదశిల్పిని వరించినదేమి? వైచిత్ర్యమా! నీవ స్త్రీజాతివి. ఈ పరిణామ మెట్లు సంభవించినది? ఇది దైవఘటన! చారుగుప్తుడేమి, శ్రీముఖశాతవాహను డేమి! ఎవరు ఆ దైవఘటనకు ఎదురేగ గలరు! ఈ బాలికను ప్రజ్ఞాదేవి లీలాపద్మమువలె కాపాడవలయును. విధివిధాన మెట్లున్ననట్లగును.

అని ఆలోచించుచుండగనే హిమబిందు “బాబయ్యగారూ! నేను మీ ఇంటికివచ్చి పదిదినముల పాటుందును. మీ అమ్మాయి నాగనిక మొన్న మా ఇంటికి పేరంటమునకు వచ్చినప్పుడు తనతో నాలుగునాళ్ళుండు మని మరియు మరియు వేపికొని తినినది. అది కాపురమునకు వెళ్ళినతరువాత ఇప్పుడేకదా పుట్టింటికి వచ్చుట, త్వరలో చక్కని పాప నెత్తికొనును. బాబయ్యగారూ! నాగనికకు అంత దూరపుసంబంధముచేసినారేమండీ?” అని యడిగినది.

“తల్లీ, ఆతడు చోళమాండలికునితో ఇక్కడకు వచ్చినాడు. కంచీపురవాసి. ఉత్తమ బ్రాహ్మణవంశమువాడు. వారి ముత్తాత శ్రీకాకుళము నుండి కాంచీపురము వలస పోయి అచ్చట ఆయుర్వేదాశ్రమము నిర్మాణ మొనర్చినారు. ప్రసిద్ధవైద్యులు. అశ్వినీదేవత లిరువు రొకరై జన్మించిన మహాశక్తి సంపన్నులు. ఈ బాలు డింకను శిశువుగ నున్నప్పుడు ఈతని తండ్రి అడవులకు ఓషధులకై పోవగా ఉన్మదదంతావళ మొకటి ఆయనను మడియించినది. అంతట మా ఇంటి కాతడు శిష్యుడై వచ్చినాడు. అతని నాగనిక ప్రేమించినది, నాగనిక నాతడు ప్రేమించినాడు.”

“నాగనిక అదృష్టవంతురాలు. మా బావగారు వచ్చినారా, బాబయ్యగారూ?”

“రాలేదు. వేసవికాలమువెళ్ళిన వెనుక వచ్చునట. ఇక్కడ ఎండ లెక్కువగాదా తల్లీ! ముక్తావళీదేవి అత్తగారును, నీవును రేపు ఉదయము మంచిది. అప్పుడు రండు. ఈ సాయంకాలము నాగనికయు, మీ పిన్నియు నిక్కడకు వచ్చెదరులే.”

ఆనందులవారు వెడలిపోయినారు. ఆనా డాంధ్రమహాసామ్రాజ్యము నందు ఆయుర్వేదము మహోచ్చదశయందుండెను. త్రాచుపాముకాటు నందిన వానిగూడ వైద్యముచే బ్రతికించుట ఆనాటి వెజ్జులకు మంచినీళ్ళ ప్రాయము.

ఆనందులవారు అఖండకీర్తి గడించిన మహావైద్యులు. ఆయన ఎట్టి వ్రణమునైన శస్త్రచికిత్సచే మాన్పగలరు. ఎముకలు కట్టగలరు. మెదడునకుగూడ శస్త్రచికిత్స చేయగలరు. ఆయన కుదర్చలేని వ్యాధిలేదు. ప్రాణము పోయలేని దొకటే ఆయన లోపము.

21. ప్రణయ భంగము

సువర్ణకుమారుడు విహ్వలచిత్తుడై చుక్కానిలేని నావవలె తిరిగినాడు. ఆతనికి మతిలేదు. ఆతడేమి చేయవలెను? బాలికలవలె కన్నులనీరు సంతత ధారగా ప్రవహింప, ఆ ధారతో మేళవించి ప్రాణాలు ప్రవహించి పోవునందాక కృశించుట ధీరస్వభావము గాదు. వెడనవ్వుతో, వెర్రివెర్రి మాటలతో, చెదరిన జుట్టుతో, అస్థిమితహృదయముతో నున్మత్తుడగుట లఘుమనస్కునికి జెల్లును. ఆశాభంగముచే రౌద్రమూర్తియై విలయావతారు డగుట కాతడు సాత్త్వికుడు.


అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 129•