పుట:Himabindu by Adivi Bapiraju.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరును వెడలిపోయినారు. ఆనందులవారు, తమ మంజూష సర్దికొనుచు, అలవోకగా “తల్లీ! ఆ బాలకుడు ఏ మనినాడు? ఆతడు ఎక్కడికైన పోవలసివచ్చినదా?” యని ప్రశ్నించెను.

హిమబిందు నీరసపు చిరునవ్వు మోమున ప్రసరింప “బాబయ్యగారు! మీదంతయు ఒక చిత్రము. ఏదియో తలతిరిగినది, పడిపోయినాను. నాయనగారు వెళ్ళినారన్న దిగు లింకను నన్ను వదలలేదు. రెండు మూడురోజులలో భయము తీరిపోవును” అని బదులు పలికినది.

“ఓసి వెఱ్ఱితల్లీ! ఎవరిదగ్గరనైనను దాగునుగాని నీ రహస్యములు నాకడ దాగవు. నీనాడి ప్రణయనాడి. అదియుగాక, నీ చిత్తవృత్తి తెలుసుకొనుట వైద్యునకు ముఖ్యావసరము. బాలనాగి నీకు ఆంతరంగిక సేవకురాలు. ఆమెనీగోడు వినును. నీబాధకు శ్రుతిగ ఆమెయు బాధపడును. అంతియే కాని ఆమె నీకు సహాయ మేమి చేయగలదు? నేను ఒక్కవైద్యుడనేనా నీ విషయమంతయు నీతండ్రికి తెలియదేమోకాని, నేను నీ వింతయున్నప్పటి నుండియు సంపూర్ణముగా నెరుగుదును. హిమ! నీవు ప్రేమించు బాలకు డెవ్వరు? ఆతడు నిన్ను తిరిగి ప్రేమించుచున్నాడని నీలోని ప్రతియణువు స్పందించు చున్నదా? నీవు శ్రీకృష్ణశాతవాహనుని ప్రేమించుటలే దని నేను స్పష్టముగ చెప్పగలను. నీవు వేరొకబాలకుని గాఢముగ ప్రేమించుచున్నావు. వట్టిప్రేమయే కాదు తల్లి, ఆబాలుని నీవు ఆత్మనాథునిగ, ప్రత్యక్షదైవముగ పూజచేయుచున్నావు. కాబట్టి నా కాబాలు డెవరో చెప్పుము. నాకితరులు చెప్పుటకంటె నీవే చెప్పరాదా?”

హిమబిందు ఎంతయో సిగ్గుపడినది. వెలవెలబోవు నామెమోము మధురకాంతులచే వెలిగిపోయినది. దరహాసము లామె యధరోష్ఠాంచలముల కాశీరత్న కుసుమములవలె నృత్యములాడినవి.

“బాబయ్యగారూ! ధర్మ....నం....దు....ల....”

“ధర్మనందులవారి అబ్బాయి సువర్ణుడా? ఈ జంబూద్వీపమునందటి అందకాడు లేడని నామతము. మహాశిల్పి. ధర్మనందిని మరపించును. తల్లీ! ప్రస్తుతము మనమున నెట్టి యాలోచన లుంచుకొనకుము. భగవంతునిపై భారము వైచి నిశ్చింతముగా నుండుము. నీకు వచ్చిన భయములేదు. నేను నీపక్షమున ఉన్నాను. భగవత్సంకల్ప మెటు లున్న నటు లగును” అని చెప్పి, ఆనందులవారు ఏదో రసాయనమును మాత్రలుకట్టి యామెకు అపస్మారహారకముగా, చిత్తశాంతికి, నరముల పుష్టికి ఇచ్చెను.

హిమబిందునకు కావలసినది మందులు కాదు. ఆమెకోరిక నెరవేరుటయ! అదియే అమృత మామెకు. చారుగుప్తునికోరిక అవితథమైనది. అతడు కొన్నిసంవత్సరము లాలోచించి ఈ నిర్ణయమునకు వచ్చియుండును. అందుకై ప్రయత్నము లెన్నియో చేసియుండును. అతనిలో యుగంధర శక్తియు, చాణక్య ప్రతిజ్ఞయు రెండును ఉన్నవి. యౌగంధరాయణుడు అతనికడ పాఠము నేర్వవలయు.

ఆనందులును, చారుగుప్తుడును, ధర్మనందియు, వినీతమతియు చిన్ననాట నుండియు ఎంతో స్నేహమున మెలంగెడివారు. చారుగుప్తుడును, ధర్మనందియు వియ్యమందుట లక్ష్మీసరస్వతు లేకమగుటయే! కూతును రాజ్యలక్ష్మినిచేయ ప్రతిజ్ఞ బూనుకొన్న చారుగుప్తుని మనస్సేరు త్రిప్పగలరు?

అడివి బాపిరాజు రచనలు - 2

• 128 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)'