పుట:Himabindu by Adivi Bapiraju.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రితకుడ్యవిరాజితమై బహుగ్రంథపేటికాసనాథమై, శిల్పవిన్యాస యుక్తమైన యా విశాలమందిరమున ఆత డొక్కడు ఆలోచనాధీనుడై యుండెను.

ఆతని కేదియో భయమును, ఏదియో ఆనందమును, వేదనయు, సుఖమును వెలుగు నీడలవలె హృదయస్పర్శ గావించుచుండెను. శ్రీకృష్ణ శాతవాహనుడు తండ్రికన్న కఠినహృదయము కలవాడు. శ్రీముఖుడు సంపూర్ణబౌద్ధభావానందుడు. శ్రీకృష్ణునకు ఒకవైపున ఆర్షధర్మాసక్తి, ఇంకొకవైపున బౌద్ధరక్షణ విజ్ఞానాభిరతి; ఒకవైపున శత్రునిర్మూలనో త్సాహము, ఇంకొకవైపున ఇదియంతయు మాయ యను నైరాశ్యభావము.

ఆతడు సంపూర్ణయౌవనుడు. వీరవిక్రమోపేతుడు. ముగ్గురు బంగారు కన్నెలాతని హృదయతాపమునకు పన్నీటి కలశములవలె వేచియుండిరి. వారు మువ్వురు ఉత్తమకులసంజాతులు. మహారాణికాదగిన ఆత్మేశ్వరి ఇంకను అతనికి ప్రత్యక్షముకాలేదు.

ఒక ప్రక్క క్షత్రియుడు, ఒక ప్రక్క బ్రాహ్మణుడు. ఆతని రాజ భోగప్రాభవము పలువురు సుందరాంగనల గోరును. ఆతని బ్రాహ్మణత్వము సహధర్మచారిణి యగు వధువునే వాంఛించును.

ఎందరో మహారాజులు తమబాలల భావ్యాంధ్రసామ్రజ్ఞినిచేయగాఢ వాంఛాయుతులై యున్నారని తెలియును. పిల్ల నిత్తుమన్న వలదనుట ప్రభు ధర్మము కాదు. ఒకభార్య యున్న కాదనవచ్చును. తన ఊహాపథాంచలాల దాటి ఒక మహాశ్వేతపన్నగాసన యగు బాలిక రెండు మూడునెలలనుండి తోచును. తద్వ్యంజనారూప మగు భావములు ఆషాడమేఘములవలె తన స్వప్నాకాశము నావరించుచున్నవి. తనయౌవనవాంఛలకు శాంతి నీయగల రనుకొన్న మూవురుత్తమకులజ లగు బాలల అద్భుతసౌందర్యమూర్తుల కోరికొని తెచ్చుకున్నాడు. వారు రాణులుకాలేదు తనకామప్రవృత్తి వారిలో ప్రతిఫలము కోరలేదు. వారు కన్యాత్వచెర వీడలేదు. వారు మువ్వు రాతని హృదయవేదన గ్రహించినారు. ఆతనికి తమ అద్భుతాంధ్రగానము అమృతము కురిపించినారు. నృత్యవిద్యానందము కాన్కలిచ్చినారు? అనేక గాధా కావ్యరస గంధములు కలపము లలదినారు. వారు దినమున కొక అలంకారము కైసేసికొన్నారు. ఆతని సరసోక్తులచే, మేలపుమాటలచే చెనకినారు. శృంగారహావభావవిలాసముల నిలువుపూజ లర్పించినారు.

శ్రీకృష్ణశాతవాహనుని మనోవేదన కుపశాంతి కలుగదాయెను. ఆ కన్యలతోడి శృంగారవిహారము లాతనిలో మేల్కొన్న యౌవనోరాగము నాడించి జోకోట్టజాల వయ్యెను. వారికన్యాత్వపుచెరలు మాత్రము విడలేదు.

16. స్వప్నభంగము

హిమబిందు కలలుకనుచు కూరుచుండినది. ఆహా! తన మనోనాయకుని రసభావములు రూపెత్తునది శిల్పములలో, సౌందర్యములు మూర్తించునది చెక్కడములలో, సర్వలోకములోని ఆనందము ప్రత్యక్షమగునది బొమ్మలలో. మహావేగముతో, అత్యంత కల్పనాచమత్కృతిలో, అద్భుత విన్యాసమహిమతో విగ్రహములు, ప్రతిరూపములు, దివ్యస్థూపములు, పవిత్ర త్రిరత్నములు, లతలు, పక్షులు, మృగములు తనమనోహరుడెంత సునాయాసమున శిల్పమును అల్లివేయగలడు!

అడివి బాపిరాజు రచనలు - 2

• 116 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)