పుట:Himabindu by Adivi Bapiraju.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


“సార్వభౌములు ఉభయధర్మ సేవకు లగుట తమ రెఱుగనిది కాదు. ఉభయుల ఆశీర్వాదములు మేము తల ధరింతుము. విశేషించి తమవంటి తపస్సంపన్నుల అనుగ్రహమునకు బాత్రుడ నగుట నా భాగ్యము” అనుచు శ్రీకృష్ణశాతవాహనుడు మహర్షియనుజ్ఞ పొంది రథమెక్కి తన కోటలోనికి వెడలిపోయెను.”

శ్రీకృష్ణ శాతవాహనుడు వెళ్ళిపోయినప్పటి నుండియు స్థౌలతిష్యాచార్యునకు ఆశ్చర్యము, కోపము, అనుమానము, విషాదము ఒక్కసారిగా క్రమ్ముకొన్నవి.

సింహ మున్న గుహ జొచ్చు లేడివలె నీ బాలుడు తనయాశ్రమమునకు వచ్చినాడు. ఈ రాకలోని భావమేమి? ఇతడేమైన ననుమాన పడినాడా? అప్పుడప్పుడు తన యాశ్రమమునకు శ్రీముఖుడును, శ్రీకృష్ణుడును వచ్చుట కలదు. మొన్న జరిగిన చంద్రస్వామి విచారణలో సోనుత్తరాదులను గురించి సాక్ష్యములందు వక్కాణింపబడెనుగదా! సోనుత్తరాదులకును, తనకును గల సంబంధము సార్వభౌముని గూఢచారులకు తెలిసినదా? ఇచట మంజుశ్రీజాడ యేమైనదొరకునని యీతడు వచ్చి యుండునా?

తనకు రాబోవు విపత్తు నెఱుగక తమ్మునికై దేవులాడుచున్నాడు పాప మీతడు! తా నట్లాశీర్వదించినాడేమి? తనవాక్కు అనృత మగుట ఎట్లు?

అనాలోచితముగ, అప్రయత్నముగ అనినమాటలే నిజమగునందురు. ఇంత మాత్రముచే దనసత్య ప్రతిజ్ఞ అసత్యమగునా? తానెంత అవివేకియైనాడు! ఉత్తమ బ్రాహ్మణునకు సర్వకాలములందు జాగర, స్వప్న, సుషుప్తుల యందును నేమరపాటు కూడదు. ఎంత ప్రయత్నము చేయుచున్నను జాగరూకతలేని వాడు హతభాగ్యుడు. పరమేశ్వరకార్యము సలుపు భక్తులకు ఎట్టి ఏమరు పాటు ఆవహిల్లగలదు?

తనలో ఏమి దోషము గల్గినది? తనదీక్షలో నేమి అధర్మమున్నది? వేద ప్రామాణ్యమును, ఈశ్వరభక్తియు సకలజంబూద్వీపము నందు నెలకొల్పుటకు తనతపస్సు, తద్యోగ పవిత్రములై, తన్మంత్రపరములై, తద్దీక్షావశములైన తనమాటల కీ స్ఖాలిత్య మేల కలిగినది? శాపాక్షరములు వెడలవలసిననానోట అమృతోపమానములై ఏ మహా సంకల్పముచే నేడట్లు “దీర్ఘయుష్మాన్భవ” యను స్వరము వెడలినది!

తన మంత్ర ప్రయోగములు శక్తిహీనము లగునా? తన అభిచార హోమములు నిస్తేజములై చల్లబడిపోవునా? వేదధర్మ ప్రతిష్ట ఈశ్వరప్రీతికరము కాకపోవు టెట్లు? ఏమైనను ఈశ్వరార్పణబుద్ధితో తనకర్మ దాను నిర్వర్తించవలెను.

స్థౌలతిష్యుడు తిన్నగ లోనికిపోయి గంగాజలములు కలిపిన జలములందు మరల స్నానమాడి, ప్రాయశ్చిత్తవిధి నెరవేర్చి, జప నిమగ్నుడై ఆ దినమంతయు నుపవాస ముండి రాత్రి రెండవయామమునకు కన్నులు తెరచినాడు.

శ్రీకృష్ణశాతవాహనుడు తన యభ్యంతరమందిరముల చేరుట తోడనే పనికత్తెలు మహారా జెప్పుడైనను బయటకు వెళ్ళివచ్చినంతనే స్నానముచేయుట యలవాటు గాన వారిని స్నానాయత్తుల జేసిరి.

మార్జనికలు స్నానగృహమునకు గొనిపోయి ఉష్ణ సుగంధజలముల యువరాజును స్నానమాడించినారు. పన్నీరుపూల అందాల మెత్తని వలిపెముల తడియొత్తి, సువాసన ధూపములు వైచి, శుభ్రవస్త్రములు కట్టి అలంకరించినారు. మహారాజంత విద్యా గృహంబున కేగి, మెత్తలు పరచిన దంతపల్యంక పీఠమున అధివసించి రక్షక స్త్రీలకు, తక్కిన సేవకురాండ్రకు పొమ్మని కనుసైగజేసినాడు.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 115 •