పుట:Himabindu by Adivi Bapiraju.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆతడెంత సౌందర్యమూర్తి! ఆతని కన్నులలో ఎన్ని మహాభావములు నాట్యము చేయుచున్నవో! ఆతని చూపులలో తాను శిల్పింపబోవు ఎన్ని మహత్తర కళారూపములు దర్శనమిచ్చుచున్నవో! ఆతని కనురెప్పలలో ఎన్ని చిత్రలేఖనములు రూపముదాల్చినవో! అతనిదీర్ఘ సమనాసికలో ఎన్ని రసాస్వాదనలు పుంజీభవించియున్నవో! ఏమి యాతని పెదవులు! ఆ ఆలోచనతో ఆమె వివశయైనది.

స్త్రీ లెక్కువ అందగత్తెలని యందురే! నిజముగ పురుషులలోనే అందము లన్నియు నెలకొన్నవి. తన పెదవులు సృష్టిలోని సర్వసౌందర్యములు సేకరించుకొని యుండవచ్చును కాని తన ఆత్మేశ్వరుని పెదవులలో సృష్ట్యతీత మగు సౌందర్యము అమృతత్వసిద్ధి నందినది.

ఆమె ప్రతి నిమేషమును ఆతనిస్పర్శను స్మరించుకొని కనుమోడ్చును. ఆతని హస్తస్పర్శచే ధన్యమైన యొడలు గాంచి మురిసికొని ముద్దాడును. తనకును ఆతనికిని జరిగిన విచిత్ర ప్రథమసమావేశము భగవదుద్దిష్టము. తన తండ్రి కోటీశ్వరు డగుగాక! శ్రీముఖశాతవాహన చక్రవర్తి దక్షిణబాహువగుగాక! విశ్వామిత్రునివలె, అపరబ్రహ్మవలె సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన సుందరాతిసుందరమూర్తి తనమనోనాయకుడైనాడు. ఇంతకంటే ధన్యత ఏమి గలదు? ఈ దైవము నెత్తికోలు నెవరు మాన్పగలరు?

హిమబిందు బాలికయైనను విద్యావతి. సమ్యగ్విచారశీల యయ్యు నపుడపుడు బాల్యచాపలాధీన యగును.

అల్లారుముద్దుగ పెరిగిన బిడ్డ. సంకల్పములు జనియించుటయే తడవుగ సిద్ధి నందించుకొనజాలిన తనయ. తమ కనుసన్నల రాజ్యచక్రములు త్రిప్పగల కోటీశ్వరులకు మనుమరాలు. గగనకుసుమములుగూడ నామెకు దుర్లభములుగావు. అట్టి యప్పు డామెకోర్కెవెల్లువలు వెన్నెలకరుళ్ళు గాకుండుటెట్లు? లోకములోని సర్వధనములు వాకలు కట్టించుకొని ఆంధ్ర దేశమునకు తరలించుకొని వచ్చు స్వర్ణదీ భగీరథుడైన చారుగుపుడు తనయను సామ్రాజ్ఞినిచేయ సంకల్పించినాడు. రాజ్యవైభవము చేకూరని ఐశ్వర్యము వ్యర్థము. ఆంధ్ర సామ్రాజ్యమును, ఆంధ్రకోటీశ్వరేశ్వరుల వర్తకమును యమునాగంగా సంగమమై నడుచుచున్నది.

సామ్రాజ్యాభివృద్ధికి ధనము దోహదమా? ధనాభివృద్ధికి సామ్రాజ్యాభివృద్ధి దోహదమా? ఎవరు చెప్పగలరు! వెనుక మౌర్యాది రాజ్యములలో కోటీశ్వరు లుండెడి వారేమో! నే డొక్క ఆంధ్రవణిక్కు ఆ ఔత్త రాహవణిజుల సంపదనంతయు దానే దక్కించుకొన గలిగినాడు. ఆంధ్రచక్రవర్తి జంబూద్వీపచక్రవర్తి యగుగాక! ఆంధ్ర వణిక్సార్వభౌముని తనయ సర్వజంబూద్వీపసామ్రాజ్ఞి అగుగాక! ఇరువురు చక్రవర్తులు వియ్యమందుదురుగాక! శ్రీకృష్ణశాతవాహనుడు చారుగుప్తుని అల్లుడు - చారుగుప్తుని మనోరథ మిట్లున్నది. దైవసంకల్ప మెటుల నున్నదో!

హిమబిందు ఆలోచనామృతపూరముల ఏ లోకములకో తేలిపోవుచు ఏ ఆనందములకో వశీభూత యగుచు ఏ మాధుర్యములనో కరిగిపోవుచు, పర్యంకముపై పరుండియున్నప్పుడు చారుగుప్తుడు రక్తచందన పాదరక్షలచప్పుడుతో కొమరితయున్న కడకు వచ్చినాడు.

ఒక్కనిమేష మాతడు పాల్కడలిలో శయనించిన బంగారులక్ష్మీవలె ఆ హంసతూలికా తల్పమున నొరగియున్న త్రిభంగ్యాకృతివిలాసముల ప్రోవు, వయ్యారముల కుప్ప, సౌందర్యముల నిధియైన తనయను తనివార చూచుకున్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 117 •