పుట:Himabindu by Adivi Bapiraju.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీముఖ: నేను మనచిట్టిబాబును నెలదినములలో నీ అంకమున చేర్చితీరెదను.

శ్రీకృష్ణ: నేనును నాయనగారితోపాటు ప్రతిజ్ఞ చేయుచున్నాను. జననీ!

***

శుభముహూర్తమున శ్రీకృష్ణశాతవాహనుడు ప్రతిష్ఠానమునకు బయలుదేరి వచ్చెను.

ఆనాడట్లు స్థౌలతిష్యాశ్రమమున బ్రవేశింపగనే మహర్షులు, పండితులు మహారాజును గోపురముకడనే ఎదుర్కొని, ఉచితోపచారముతో లోనికి తీసికొనిపోయిరి. శ్రీకృష్ణశాతవాహనుని వారట్లు కొనిపోయి ఆశ్రమమునందు పూజామందిరమున ముఖ్యప్రదేశమున వ్యాఘ్రాజినముపై నధివసింపజేసిరి.

ఇంతలో స్థౌలతిష్యమహర్షి శ్రీకృష్ణశాతవాహనునకు దర్శనమీయ నా పూజామందిరమునకు లోనుంచి వచ్చుటతోడనే యాయన లేచి యా మహర్షికి సాష్టాంగ వందనమాచరించెను.

ఎదుట సాష్టాంగపడిన బాలుని అనాలోచితముగ స్థౌలతిష్యుడు “దీర్ఘాయుష్మాన్ భవ” అని యాశీర్వదించినాడు. వెంటనే ఆ ఆశీర్వాద భావ మాయన మనోవీధిని బొడసూపినది. అంతటి మహాజ్ఞానియు గడగడ వణికినాడు. ఆయన కోపము మిన్ను ముట్టినది. కన్ను లెఱ్ఱవారినవి. పెదవులు వణకినవి. మహర్షి కొంతవడికి తన క్రోధాదికముల నడంచుకొని, లేని చిరునవ్వు మోమున దెచ్చి పెట్టుకొని,

“మహాప్రభూ! లెండు. ఎప్పుడు దయచేసినారు?” అని ప్రశ్నించెను.

“నిన్ననే వచ్చినాను మహాఋషీ!” అని శ్రీకృష్ణుడు ప్రతివచనము చెప్పుచు, లేచి స్థౌలతిష్యునితోబాటు తనయాసనము నధివసించెను.

మహాగ్నిశిఖలై ఆంధ్రభూమిని గప్పుచున్న సాయంకాలపు వెలుగులు త్రియంబకేశ్వరుని జటామకుటమునందు పొడసూపినవి.

15. వెలుగు నీడలు

స్థౌలతిష్యుడు: (శ్రీకృష్ణ శాతవాహనుని తేరిపారజూచి) మహారాజా! తమరువచ్చి రెండుదినములైనను కాలేదు. సంపూర్ణముగ శ్రమతీరకమునుపే తాము మా ఆశ్రమమునకు విజయము చేసినారు.

శ్రీకృష్ణ: మహర్షీ! పని యేమియులేదు. నేను యిచ్చటకు జేరుదినమునకు మూడు దినముల ముందటనే ఈ ఆశ్రమమునకు తమరు వచ్చినారని నా మంత్రి యెరిగించినాడు. తమ ఆశీర్వాదము పొందుటకును, ఇదివరకు మీరీ యాశ్రమమునం దున్నపుడెల్ల నేను చేయు సేవను మరల చేయ అనుమతి నడుగుటకును వచ్చియుంటిని. ఆశీర్వాదము నందితిని. నేనును, ఈ మహదాంధ్ర దేశమును తమ సేవ కెప్పుడును సిద్ధము.

స్థౌలతిష్యుడు వెడనవ్వు నవ్వుచు, “మహారాజా! ఈ వినయసంపద తమ కెంతయు తగియున్నది. కాని శాతవాహనులకు శ్రవణకాశీర్బలమే సర్వాభీష్టములను సమకూర్ప జాలియుండ, ఈ బడుగుబాపలకై తమరెందు కింత శ్రమ పడుట? ఈ యాంధ్రభూమిలో బ్రాహ్మణుల కీ మాత్రము నిలువ నీడ నిచ్చుచున్నారు. మా కదియే పదివేలు” అనియెను.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 114 •