పుట:Himabindu by Adivi Bapiraju.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెత్తని హంసతూలికాపధానముల జేరగిలి మేనువాల్చియున్న సార్వభౌముడు సువర్ణ మఞ్చమునుండి లేచి, త్వరితముగ మందిర కవాటము కడకు వచ్చి, పాదాభివందన మాచరించిన పుత్రుని భుజములుపట్టి ఎత్తి, హృదయమున కదిమికొని వేరొండు సువర్ణాసనముపై తనయు నధివసింపజేసి తా నధివసించెను.

“కుమారా! మీరు ప్రతిష్ఠానపురము పోవుటకు ముహూర్తమును కార్తాంతికులు ఏర్పాటు చేసిరట కాదా!”

“సర్వసైన్యములు సిద్ధముజేసి యుంచుకొనుడు. మహారథి విశ్వసేని నాగమహారాజును సైన్యాధిపతి చేయుడు. మన రథికులకు వ్యాఘ్రనదీ రాజపథమువెంట ఉజ్జయినికి సహాయముపో నాజ్ఞయిండు. మీరు నాగసైన్యములును, ఆంధ్రసైన్యములను తీసికొని, ఆభీరులను దాకి భరుకచ్చము బట్టుకొనుడు. అచ్చట కొన్ని సైన్యములతో అఘబలమహారాజును కాపుంచి మీరు ఉజ్జయినికి రండు.”

“చిత్తము. మహాప్రభూ! అటులనే చేయుదును.”

అంతటితో సార్వభౌమునకును, మహారాజప్రతినిధికిని జరుగవలసిన తంతు నడచినది. ఇంక వారిరువురును తండ్రికుమారులు.

“తండ్రీ! నీవు జాగ్రత్తగా ఉండవలయును సుమీ! మీ యమ్మయు నేనును మా కన్నులు నీమీదనే పెట్టికొనియున్నాము. దేశములో కొంతమంది చేయు కుట్రలన్నియు తెలియవచ్చినవి. స్థౌలతిష్యమహర్షి మన వంశమునకే విరోధిగా మారినారు. మీతమ్ముడు మంజుశ్రీని ఎత్తుకొని పోవుటలో ఆ మహర్షి ప్రోద్బలమున్నట్లు తెలియుచున్నది. ఆయనకు ప్రతిష్ఠానములో వేరొక ఆశ్రమమున్నది. మొన్ననే ఆయన తన శిష్యకోటితో, భక్తగణముతో ప్రయాణములు చేయుచు ఆ ఆశ్రమము చేరినారట.”

ఇంతలో ప్రతీహారి “జయ! జయ! సార్వభౌములకు!” అని వినయమున ద్వారముకడ పలికెను. సార్వభౌము డా దిక్కుచూచి “ఏమి?” అని ప్రశ్నించెను.

“ప్రభూ! మహాదేవి దేవరవారిదర్శనార్థము అనుమతి కోరినారు.”

“ప్రవేశపెట్టుము.”

శ్రీకృష్ణుడు ఆసనమునుండి లేచి, త్వరితముగ గుమ్మముదాటిపోయి, వచ్చుచున్న మహారాణి పాదములకు మోకరిల్లి నమస్కరించెను.

ఆనందమహారాణి చిరునవ్వుమోమును వెలిగింప పుత్రుని ఆశీర్వదించెను. ఆతడు, లేవగనే ఆమె గుమ్మముదాటి, లోని కరుదెంచి, భర్త పాదములకు నమస్కరించినది. శ్రీముఖుడు దేవిని తనప్రక్క సువర్ణ మఞ్చముపై కూర్చుండ బెట్టికొనెను.

వారంద రధివసించిన వెనుక ఆమె కుమారుని కనుగొని “తండ్రీ! నీపై నా ప్రాణమంతయు పెట్టుకొంటిని. మీ నాయనగారు వీరులు మరల యుద్ధము సంకల్పించినారు. నీవును యుద్ధమునకు బోకతీరదా?”

శ్రీకృష్ణ: అమ్మా! రాజబ్రాహ్మణడనై పుట్టి యింట కూర్చుందునా? అధైర్యపడకుడు. యుద్ధములో నాకు వచ్చిన భయము లేదు.

శ్రీముఖ: అబ్బాయి ప్రతాపమును శత్రుల కిప్పుడే చవిచూపినచో ముందుముందు రాజ్యము నిష్కంటకమగును. నువ్వు అధీరవు కావలదు.

దేవి: ప్రభూ! మీ రెప్పుడు అలాగుననే యందురు. నా మంజు ఏడీ?

అడివి బాపిరాజు రచనలు - 2

• 113 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)