పుట:Himabindu by Adivi Bapiraju.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశ్య: ఆర్యా! గగనీ! నా కేదో భయము వేయుచున్నది. మన విద్యలో నెచ్చటనో దోషమాపాదిల్లినది. నీ వొక కృపాణమును చేసితివి, పదనుబెట్టితివి. ఆ కత్తి నీ వెటుల ఉపయోగింతువో అటుల పనికివచ్చును. ఆ కత్తి “నేను వానిని ఖండించను” అనిన నీ వేమి చేయుదువు?

గగ: అవును సోదరీ, అవును. మనగురుదేవులగు స్థాలతిష్య మహర్షి గురు పరంపరలో రెండవవా రగు మహాదేవ దేవసోమోత్తర మహర్షి విషకన్యనొనర్చి చాణక్యదేవున కర్పించెనట. ఆ విధానముననే మనము మంత్ర తంత్రాలన్నియు ఉపయోగించితిమి.

అక్కడ కేళాకూళికడ విషబాలయు, అగస్తియు మాటలాడు చుండిరి. విషబాల నీళ్ళలో తన ముఖప్రతిబింబము చూచుచు ఎదుటనున్న యోగిని ముఖము చూచుచు కన్నుల నీరు తుడుచుకొనుచుండెను. ఆమె నగస్తి అనునయించుచుండెను. అగస్తి హృదయమునను “ఏమిది?” అని ప్రశ్న యుదయించినది.

అగస్తి: నీవును నేనును ఒకటి కాదు.

విష: (కన్నుల నీరు తుడుచుకొని ఆశ్చర్యమందుచు) మీరు మువ్వురు బట్టలు లేకుండ స్నానము చేయునప్పుడు నేను చూచితిని. మన కందరకు అవయవములన్నియు ఒక్కరీతిగ నున్నవే?

అగస్తి: కావచ్చును. ఉలూపియు, అర్జునుడును పాములేకదా!

విష: అవును.

అగస్తి: అవి రంగులలో భేదముగా నున్నవా, లేదా?

విష: అవును. ఆలాగుననే మీరును నేనును రంగులలో భేదించి యుంటిమి. అయినను మనము ఒక్కజాతివారము.

అగస్తి: ఏ జాతివారము?

విష: ఏమో?

గగనియోగినివలన నాహూతుడై స్థౌలతిష్యుడంత నచ్చటికి వచ్చెను.

స్థౌల: చంద్రా!

విష: చిత్తము! తాతయ్యగారూ!

స్థౌల: నీకు కంట నీరు వచ్చినదట?

విష: వచ్చినది.

స్థౌల: ఎందుకు తల్లీ?

విష: తాతయ్యా! నేను, అగస్తియు ఒక జాతివారమా, కాదా?

స్థౌల: అవును! అయినా కొన్ని బేధము లున్నవి.

విష: నీకును నాకును సంబంధ మేమిటి?

స్థౌల: నీకేమి తోచినది?

విష: నాకా? ఉలూపికి పిల్లపాము లెన్నో పుట్టినవి, ఆలాగుననే నేనును నీ కడుపున పుట్టితిని.

స్థౌల: నా కడుపునా?

విష: లేకపోయిన నే నన్న నీ కంత ఇష్ట మెందుకు? తన చిన్న పాములన్న ఉలూపికి ఎంతో ఇష్టము. ఇతరపాములను వానివైపునకన్నా రానీయదు. అర్జునునికూడ

అడివి బాపిరాజు రచనలు - 2

• 93 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)