పుట:Himabindu by Adivi Bapiraju.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటుల ఆ బాలికకు రెండు మూడు కలలు వచ్చినవి. ఆమెలో పరిమళములు గుబులుకొనుచున్నవి. ఆమెలో తేనెలు చేరుచున్నవి. ఆమెలో మార్దవములు అలముకొనుచున్నవి.

5. నేనును ఆడుదాననే!

స్థౌలతిష్యాశ్రమమందు ఆ మహాఋషి పూజామందిరశాలలనంటి విషకన్యక గృహములు, వనమును ఉన్నవి. ఆ గృహములకు దారి స్థౌలతిష్యముని మందిరము నుండి మాత్రమే యున్నది. ఆయన ఆజ్ఞలేనిదే ఏరును ఆ గృహములలోనికి బోవుటకే వీలులేదు. విషకన్యకారామములను వనమును చుట్టి ఎత్తైన కుడ్యమున్నది. ఉత్తరమున, తూర్పున ఆ గోడ కృష్ణానది నంటియున్నది. స్థౌలతిష్యుని మందిరమునంటి యొకశాలలో మంత్రానంద తంత్రానందులను ఇరువురుద్దండులైన శిష్యులు నివసించు చుందురు. వారు మహావిషవైద్యులు, మంత్ర శాస్త్రవేత్తలు, మహాయోగులు. వారెరుగని విషములుగాని, ఆ విషములకు విరుగుడులుగాని ఈ లోకమునందు లేవు. విషకన్యకను పెంచుటలో, నామెను దారుణమృత్యు కీలగా నొనర్చుటలో ఈ శిష్యులిరువు రామెకు దాదులైరి.

ఆ మందిరములోనికి విషకన్యకామందిరశాలలనుండి ఒకరజ్జువున్నది. ఆ రజ్జు వొక ఘంటికకు ముడివేయబడియున్నది. ఆ రజ్జువున కావలికొన విషకన్యక నిదురబోవు మందిరమున నున్నది.

వీరిరువురుకాక స్థౌలతిష్యునికి ముగ్గురు కాపాలికలు శిష్యురాండ్రున్నారు. వారును మంత్ర తంత్ర శాస్త్రములందు ప్రవీణలు, విషవైద్యమున సిద్ధహస్తలు. వారు మువ్వురు విషకన్యకకు స్నేహితురాండ్రుగా, చెలికత్తెలుగా, గురువులుగా నుందురు. ఏ యవసరము వచ్చినను వారు గాని, విషకన్యగాని ఆ తాడు లాగుదురు. వెంటనే మంత్రానంద తంత్రా నందుల గదులలో గంటలు మ్రోగును. ఒకసారి గంటమ్రోగినచో మంత్రా నందుడు పోవును, రెండుసారులు మ్రోగినచో తంత్రానందుడు పోవును. నాల్గయిదుసారులు మ్రోగినచో నిరువురు నేగుచుందురు.

మలయనాగుడు చనిపోయిన మరునాడు విషకన్యక ఏదియో మనోవేదన పాలయ్యెను. స్నేహితురాండ్రయిన యా కాపాలిక లెన్నివిధముల ననునయించినను ఆమె యూరడిల్లలేదు. ఆమెకన్నుల బొటబొట నీరు కారుచునేయుండెను.

“విషబాలకంట అశ్రు లేమి? ఆమెకు హృదయమున బాధ ఏమి? ఆమెకు హృదయ ముండునా?” అని కాశ్యపి యను యోగిని తనతోటి యోగిని గగని యను నామెను ప్రశ్నించినది. మూడవయామె అగస్తి విషకన్యకతోపాటు తోటలో నొక కేళాకూళికడ కూర్చుండి యా బాలికతో మాటలాడుచుండెను.

గగ: సోదరీ! ఆమె హృదయమును సంపూర్ణముగా కుదించి, వెనుకకు తీసికొనిపోయి భయంకరశార్దూలికున్న హృదయమును చేసినాము. ఈ శార్దూలి హృదయము మానవశార్దూలి హృదయము. మానవ మాంసభక్షణమును మరగిన శార్దూలము అన్నిజిత్తు లెరుగును. ఆ శార్దూలము మానవియైనచో నెటులనో అటులనే ఈ బాలికను మనము పెంచితిమి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 92 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)