రానీయదు. ఆ పాములు కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి. ఆలాగుననే నేనును నీ కడుపున పుట్టియుందును.
స్థౌల: ఈ ఆలోచనలతో కంట నీరు వచ్చినదా?
విష: అవును తాతయ్యా! ఇంకను ఏవో ఆలోచనలు వచ్చినవి. ఎవ్వరు నన్ను ప్రేమించి వచ్చినది మొన్న పూజార్పణవేళ? అట్లుచేయుట ప్రేమయంటిరికదా మీరు. వా డట్లు నన్నదిమిపట్టుకొన నా కేదియో జల్లు మన్నది కోపము వచ్చినది.
స్థౌల: కోప మన ఏమిటి?
విష: చంపివేయవలే ననుకొనుట.
స్థౌల: నీకు తరువాత కామమునుగూర్చి, ప్రేమనుగూర్చి చెప్పెదను. కాని ఇప్పుడు నీకు కోపమే రావలసియున్నది. నీ వొకరిని చంపి వేయవలయును
విష: మీరు చంపివేయకూడదా? ఈ అగస్తిగాని, గగనిగాని, కాశ్యపిగాని చంపకూడదా?
స్థౌల: తల్లీ! నీవు మా అందరిని మించి పుట్టినావు. నీవు కారణ జన్మవు. నేను చేయుపని వేరు. అగస్తియు, గగనియు, కాశ్యపియు చేయు పనులు వేరు. నీవు చేయుపని మనలనందరిని కడుపునగన్న భగవంతునిపని. అట్టిపనులు నేనుగాని, యీ యోగినులు గాని చేయలేము. ప్రేమించువారే చంపివేయువారు. నీవు ప్రేమించవలెను, చంపి వేయవలెను. ఉలూపి అర్జునుని ప్రేమించును. అయినను అర్జునుని చంపుట కెన్నిసారులు ప్రయత్నించి మానలేదు. తన బిడ్డలలో రెండు మూడింటిని మింగివేయుట నీవును చూచితివికాదా!
విష: అవును తాతయ్యా! నన్ను మీరు ప్రేమింతురు. నన్ను మీరేల చంపరు?
స్థౌలతిష్యుడు హృదయమున వడకెను. ఆయన యొక్క నిమేష మాత్రమూహించి, “తల్లీ! తొందరపడకుము. భగవంతుని ఇచ్ఛ ఎట్లున్న నట్లగును నీవు సంతోషముగ నాడుకొనుము. మనమందరము కొలదిరోజులలో ఇంకొక ప్రదేశమునకు బోవుదము. అచ్చట ఎన్ని చిత్రములో ఉండును. నీవు చూచెదవు. గోదావరినది, అడవులు, కొండలు, అనేకవిధములగు పూవులు, చెట్లు, ఇంక ఎన్నో వింతలు, ఆటబొమ్మలు గలవచట.
విష: అవునా తాతయ్యా! అన్ని ఆటవస్తువులా! ఓహో! నాకు ఆడుకొనుటకు ఒక... ఒక... ఆ చచ్చిపోయినవానికన్న అందంగా ఉండే బొమ్మను ఈయవా?
స్థౌల: ఇచ్చెదనమ్మా! ఇచ్చెదను. ఆడుకొనుటకు బొమ్మను కాదు ప్రేమించుటకు మంచి పురుషునే ఇచ్చెదను.
ఆతని కళ్ళవెంట స్ఫులింగములు రాలినవి. ఆ కళ్ళలోని తేజస్సును కనుంగొని ఆ ముగ్గురు యోగినులు గజగజలాడిరి. విషబాల నవ్వుచు, చప్పట్లు కొట్టుచు ఆ వనములోనికి పరుగిడిపోయినది. ఆ వనమంతయు దిరిగి, యా భయంకరాద్భుతసుందరి సాయంకాలమునకు తన మందిరము చేరి యా ప్రక్కశాలలోనున్న గగనికడకు పోయి, “గగనీ! నేనును ఆడుదాననే” యనినది.
6. సుశర్మ
పాటలీపుత్రమున రాజభవనమునందు సుశర్మచక్రవర్తి సుఖాసీనుడై యుండెను. సుశర్మ రూపసంపదగల్గిన బ్రాహ్మణుడు. కాని ధనువునకు అయిదంగుళములు
అడివి బాపిరాజు రచనలు - 2
• 94 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)