పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

హేమలత

నుండిరి. అంతట బ్రతాపసింగు తనస్థానమున గూర్చున్నతోడనే మదనసింగు తనయేలిక కభిముఖమై చేతులుజోడించి యిట్లు చెప్పసాగెను. మహాప్రభూ! ఈ నిలువబడినవాడు మహారాష్ట్ర బ్రాహ్మణుడు, ఇతడలాయుద్దీనున కాంతరంగికుడై మనవద్ద మాయోపాయముచేత జీవించుచున్న యా వసంతభట్టునకు జక్రవర్తికడనుండి యుత్తర ప్రత్యుత్తరములదెచ్చుచు దన్నెవరుబట్టుకొనకుండ సన్యాసివేషముతోనున్నాడు. ఈతనివృత్తి యిదియై నట్లును వసంతభట్టు దురాత్ముడైనట్లును వీనిదగ్గఱ నాకు దొరికిన యీయుత్తరములే సాక్ష్యము నిచ్చుచున్నవి. వీని నిజమైనపేరు పాండురంగనాథుడైనను జ్ఞానానందస్వామి యనుపేర వర్తించు చున్నాడు అని తన చేతనున్న యుత్తరములు లక్షణసింగునకందిచ్చెను. వసంతభట్టు దురాత్ముడని వినుటకు ననేకులాశ్చర్యపడిరి. పారసీక భాషలోనున్న యీయుత్తరములను లక్ష్మణసింగు గోరాసింగునకిచ్చి చదువుమన నతడా కాగితములనెల్ల బరీక్షించి యందు ముఖ్యమగు నొకదానిని నీక్రింది ప్రకారము చదువు నారంభించెను. శ్రీఢిల్లీచక్రవర్తి యగు నాలాయుద్దీను వసంతభట్టునకు వ్రాయునదేమన – మిత్రుడా! నీతో నేను గపటకలహమును గల్పించుకొనుటయు నిజముగ నాగ్రహము వచ్చినవానివలె నేను సభయందు నటించుటయు, నారాత్రి నిన్ను నేను రహస్యముగ జెఱనుండి విడిపించుటయు, జిత్తూరునగరమునకు నిన్ను నేను తద్రహస్యముల నెరుగుట కంపుటయు నీవఱ కెవ్వరును నెరుగరు. నీవు లక్ష్మణసింగును జెఱపెట్టుటకు విశేషముగ శ్రమపడుచున్నావని విని సంతోషించుచున్నాను. ఎట్లయిన లక్ష్మణసింగును బట్టి తప్పక తీసుకొనిరావలయును. అప్పుడు రాజపుత్రులు తమప్రభువు ప్రాణములను రక్షించుకొనుటకు మనమెట్లు చెప్పిన నట్లు విందురు. దండయాత్రమాట