పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

93

రాజులను వారి కావల మంత్రిదండనాయక ప్రముఖవియోగులును, వారి వెనుక విదేశాగతులగు రాయబారులును గూరుచుండిరి. కాని ప్రతాపసింగు మదనసింగు లేమిగారణముననో రానందున సభ్యులందరు దత్కారణము నూహించుచుండిరి. లక్ష్మణసింగు, మదనసింగు ప్రతాపసింగులు రాకుండుటకు గారణమును దెలియగోరి సభ నుద్దేశించి యిట్లనియె. ఓసభాసదులారా, అలాయుద్దీను మన దేశముపై దండెత్తుటనుగూర్చిన యదార్థస్థితి మీరెరుంగుదురేమో దెలియగోరి మిమ్మిటు రప్పించుటకయు దర్బారు పిలిచినాడను. కాని నిన్నరాత్రి తద్విషయమై పరిపూర్ణముగ మేము తెలిసికొంటిమి. ఆయంశముల నిచట నుపన్యసించుట ముఖ్యమైనను మదనసింగు ప్రతాపసింగులు రానందున సందేహింపవలసివచ్చెను. వారు రాకుండుటకు గారణమెవరైన నెరుఁగుదురే? అనవుడు స్వామి పలుకులకు దొరలెల్ల దెల్లబోయి తత్కారణము నెరుగక యొండొరుల మొగముల జూచుకొనుచు రాత్రి జరిగిన యంశముల నాలకించుటకు నాత్రముతో గూరుచుండిరి. ఆసభలో ననేకులు వసంతభట్టు రానందున గుసగుసలాడుచుండ నా సమయమున నొక సేవకుడు వచ్చి ప్రతాపసింగు మదనసింగు వచ్చుచున్నట్లు రాణాతోజెప్ప సభ్యులందరు వారిరాక కెదురుచూచుచుండిరి. అప్పుడొక పచ్చని దృఢశరీరముగల మనుష్యుని వెంటబెట్టుకొని యాయుధపాణులై వారిరువురును వచ్చి రాణాకు నమస్కరించి యామనుష్యుని రాజు నెదుట నిలువబెట్టిరి. ఆ మనుష్యునకు రెండుఱెక్కలును వెనుకకు విఱచి కట్టబడియుండెను. తలయెత్తక నేలచూపులు జూచుచు సన్యాసివేషములో నిలువ బడియుండిన వానిని జూచి సభ్యులు మహాశ్చర్య మేదియో వినక పోమని యాత్రముతో నిశ్శబ్దముగ