పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

ఆ మరునాడుదయమున మహారాణావారి దర్బారు నియమింపబడెను. సభామంటపమునకు రాజబంధువులును, రసపుత్రకుమారులును, సామంతులును వేఱువేఱుగ దమతమ బిరుదచిహ్నములతోడను సేవక సమూహములతోడను, సమస్తభూషణముల ధరించి వచ్చి తమ గౌరవములకుందగు స్థానముల యందు గూర్చుండిరి. అప్పుడు మదగజేంద్రము నుండి మెల్లగ దిగి కనకదండములు ధరించి కైవారముసేయు నేత్రహస్తులిరుగడల గొలువ సేవకులు మార్గమును బ్రదర్శించుచుండ శ్రీలక్ష్మణసింగు మహారాజువారు, భీమసింగు మహారాజువారును గొలువుకూటమును జేరిరి. సభామందిరము రెండువేల మంది మనుష్యులేకకాలమున గూర్చుండునంతటి వైశాల్యముగలిగి సాలగ్రామ శిలానిర్మితములై స్నిగ్ధములయిన గోడలతోడను, పైనున్న బల్లకూర్పుమీద జేయబడిన విన్నాణపు లక్కపనులతోడను, మహాలక్ష్మీ విలాసబాసురమై యలరుచుండెను. అట్టి కొలువుకూటమునుజేరి తన్మద్యంబునస్ఫటిశిలా నిర్మితమగు వేదికపై ధగధగ మెఱయుచున్న బంగరుకోళ్ళు దంతపు సింహాసనముపై మహారాణా లక్ష్మణసింగు సుఖాసీనుడయ్యెను. ఆయనకు దక్షిణభాగమున రసపుత్రకుల ప్రదీపకుడగు భీమసింగును, భీమసింగునకావల సింగపుగొదమల వంటి యాతని పండ్రెండుగురు కుమారులను, వారి కావల వాని మేనమామయు రాజపుత్రసేనాధిపతియు భీమసింగునకు ముద్దుల మఱదియునగు గోరాసింగును, వానిముందఱ బాలుడయ్యు బరాక్రమవృద్ధుడని పేరుగాంచిన గోరాసింగు పుత్రుడగుబేడల్ యును గూర్చుండిరి. మహారాజు కెడమప్రక్క సామంత