పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంపినాఁడను. ఇప్పటికి వారును వచ్చుచుందురుగాని మీ క్రొత్త మొగమును జూచినతోడనే పారిపోవుదురేమో యని భయమగుచున్నది” అని పలికెను. ఎట్లయినఁ గార్యవిఘ్నముగాకుండ సఫలముచేయుట స్వాములవారి యభిప్రాయమగుటచే “అయ్యా! నేను ముసుగుఁవెట్టుకొని యిక్కడఁ గూర్చుండెదను. వారు రాఁగానే నా కాలు గోకుడు అప్పుడు లేచి వధించెదను” అని స్వాములవారు శరీరమునిండ ముసుగువేసికొని యొకమూల గూర్చుండిరి.

చిదానందయోగి వానికక్ష పాలయందలి కాగితముల కట్టను సంగ్రహించి స్వామితోఁ గొన్ని యంశముల ముచ్చటించుచుండ బ్రతాపసింగును మదనసింగును నాకస్మికముగ లోనికివచ్చిరి. వెంటనే స్వాములవారు లేచి “వీడేనా మదనసింగు? కత్తి కత్తి” యని కలవరపడుచుండ మదనసింగు ముందఱికివచ్చి “ఓరీ! పాపాత్ముడా! నీకుగత్తి యెందుకురా! నీబ్రతుకునకుఁ దోడు నీవు మదనసింగును జంపగలవా? అట్లయిన రా రమ్ము, నేనే మదనసింగును. అదిగో కత్తి” అని కత్తినందించుచుండఁ బ్రతాపసింగుని ఆజ్ఞచే నతని పరివారము స్వామిపైఁబడి పెడఱెక్కలుకట్టి బలవంతముగఁబట్టి బంధించిరి. తరువాత బ్రతాపసింగు స్వాములవారిని దనయింటికి దీసికొనిపోయి తెల్లవాఱువఱకు వాని నొక గదిలోనుంచెను. చిదానందయోగి తాను స్వాములవారి కక్షపాలనుండి సంగ్రహించిన కాగితముల కట్ట మదనసింగునకిచ్చి దర్బారునందా కాగితముల ఠాణాకు సమర్పింపవలయుననిచెప్పి తాను మఠమునకుఁ బోయెను.