పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

85

సేవ — మిమ్మెవరు పంపినారు? ఎవరినిమిత్తము వచ్చినారు?

మద — నీవిక్కడివాడవా? విదేశీయుడవా? ముందామాట చెప్పుము

సేవ — మాదీగ్రామము కాదు. నేను జ్ఞానానందులవారి శిష్యుడను.

మద — జ్ఞానానందులవారి దర్శనమునకే మేము వచ్చినారము.

సేవ — అట్లయిన నర్ధరాత్రమందేల రావలెను? రేపు పగలు రండు.

చిదా — ఈ రాత్రిరమ్మని స్వామి మాకుత్తరువు జేసినాడు. నీయసంబద్ధ ప్రశ్నలతో గాలము బుచ్చక మారాక వారి కెఱిఁగింపుము.

సేవ — అట్లయిన లోపల నున్నారేమో చూచివచ్చెదను. ఆయన యిట్టి సమయముల యందు స్మశానములో జపము చేసికొనుచుందురు గాని యింటిదగ్గఱ నుండరు. ఉన్నట్లన మీపేరు చెప్పెదను. మీరెవరు?

చిదా — మమ్ము వసంతభట్టు పంపినాడు. అతి రహస్యములున్నవి.

సేవకుడుఁ డీమాటల నాలకించి లోపలికరిగి మఠమునకు వెనుకప్రక్కగోడలో సొరంగమువలె నున్న నేలకొట్టులోఁ గూర్చుండియున్న జ్ఞానానంద స్వాములవారింజూచి యీ మనుష్యులజాడఁ దెలుప స్వామి కొంచె మాలోచించి యా క్రొత్తవారల విషయమై సమస్తము దెలియగోరి తాను మఠమందున్నయొక గదిలో బ్రవేశించి తలుపులు మూసికొని వీరి నిరువురను దద్వారముదగ్గఱకు రమ్మని వర్తమానము పంపెను. వారట్లువచ్చి గది