పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

హేమలత

గుమ్మముదగ్గఱ నిలువ జ్ఞానానందులవారు మదనసింగులతో నిట్లు మాటాడిరి.

జ్ఞానా — అయ్యా! మీరెవరు? నాతోమీకేమిపని యున్నది?

మద — అయ్యా! తమరు మావిషయమై యనుమాన పడవద్దు. మేమన్యులముగాము. తలపుదీసి మాతో మట్లాడుడు.

జ్ఞానా — అట్లయిన నేను మిమ్ము నమ్ముట కొక యానవాలు చెప్పుడు.

చిదా — మీపేరు పాండురంగనాధుఁడు కాదా?

జ్ఞానా — (ఆశ్చర్యముతో) అవునవును.

అని తత్క్షణమే తలుపుదీసి వెలువడెను. అతని పసుపుపచ్చని దీర్ఘకాయము గనుగొనినతోడనే యోగియు సింగును వానిని గపట సన్యాసిగ నెఱిఁగిరి. అంతట వారందఱు నిట్లు సంభాషించిరి.

జ్ఞానా — అయ్యా! మీచరిత్రములను గొంతజెప్పి మా వసంతభట్టు వృత్తాంతమును దెల్పుడు.

చిదా — అయ్యా! వసంతభట్టీ నగరమునకు వచ్చిన దాదిగ మేమిరువుర మతని యనుచరులమై యుంటిమి. అతడు మాకు నెఱిఁగింపకుండ నీవఱకే కార్యమును జేయలేదు. ఈ రాత్రి లక్ష్మణసింగును జెఱఁబెట్టినాము. అందుకే తమ దర్శనమునకు నన్నాతడు వడిగ నంపెను.

ఆ పలుకు లాలించి జ్ఞానానందస్వామి యాత్రముతో “పట్టుకొన్నారా? పట్టుకొన్నారా? ఆహాహా! ఔరా! వసంతా! ప్రజ్ఞయనగా నీదే ప్రజ్ఞరా.