పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

హేమలత

చుండిరి. అందొకఁడు దృఢశరీరము గలదక్షిణ హిందూస్థాన వాస్తవ్యుఁడు; రెండవ వాఁడతిసుకుమారుఁడైన బాలుఁడు. వారిసంభాషణ నాలకింపఁ దలఁచి యోగి తనకడ నున్న కంబళమును గప్పుకొని యాపంచను గూర్చుండి యుచ్ఛ్వాసనిశ్వాసములను వదలక మెదలక యుండెను. అప్పుడందున్న వారిట్లు ముచ్చటించిరి.

బాలు – ఏమయ్యా! రెండుజాము లయినది. వారింకను రాలేదేమి?

బ్రాహ్మ – మహారాజా! చిత్తము వారు తప్పక వచ్చెదరు. మదనసింగు మనల నందఱ నీరాత్రి నిర్మూలించుటకుఁ బ్రతిజ్ఞగైకొన్నవాఁడు. మీరాజవంశమునకు మదనసింగు మిగులక్షేమము జేయునట్లగపడును గాని వాఁడు చక్రవర్తితో మిగుల స్నేహము గలిగి యున్నాఁడు. మిమ్ముఁజంపి మీశిరస్సును జక్రవర్తికి గానుకగానంపెద నని వాగ్దానము చేసినాఁడు. అందుచేతనే దుర్మార్గుడయిన మ్లేచ్ఛుని వలన నతఁడట్టి గౌరవము నొందెను. వారు సమయమునకు వచ్చుచుందురు. వారు పట్టణమునఁ జేయుకుట్రల నెల్ల మీకు నివేదించుటకే సుఁడీ, మిమ్ము నీమారుమూలకుఁఁదోడ్కొనివచ్చినాడను. మీకు భయము రవ్వంతయు లేదు. నాచేత గత్తియున్న దిదిగో —

బాలు – భయము నాకుఁగాదు, నాజాతిలో నెవ్వరికిని లేదు. నాచేఁగత్తి యుండఁగా నాకుభయమేల? మదనసింగు మాకింత ద్రోహము దలఁచునని మేమన్నఁ డెఱుఁగము. వారినీదినమున బట్టుకొని భీమసింగు మహారాజున కప్పగింప వలెను.

బ్రాహ్మ – మహారాజా! దేవరవారికి నే నుపదేశించిన దానికంటె మీ