పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

79

రెక్కువ విషయముల నీ రాత్రిచూడఁగలరు. వారు కుట్రలఁ జేయునపుడు సాధారణముగ నీగృహమునకు వత్తురు. నేఁడెందుచేతనో యిటకు రాలేదు. వారూరిబైట తోఁటలో నేఁడు కుట్రలు చేయుచుండి యందురు.

బాల – మన మక్కడకుఁ ద్వరితముగ నరుగుదము రమ్ము. తెల్లవాఱకముం దెట్లయిన నాదుర్మార్గులఁ బట్టుకొందము.

బ్రాహ్మ – నానిమిత్తమొక సేవకుఁడు రావలెను. వాఁడు వచ్చినతోడనే మన మాస్థలమున కరుగుదము. నేనావలకుఁబోయి చూచి వచ్చెదను.

అని బాలు నాచీఁకటింటనిలిచి బ్రాహ్మణుడీవలకు వచ్చుటకు యత్నించుచుండెను. ఆమాటల నాలకించి చిదానంద యోగి తూమునుండి సత్వరముగా బైటకు జని మదనసింగును వెంటబెట్టుకొని అబ్బాయి! ఇటురా, లోపలినుండి బ్రాహ్మణుఁడీవలకు వచ్చుచున్నాఁడు. వానికి మన మగపడకుండ నాగోడ చాటున నుందము. వాడొక సేవకునితో మాటలాడునఁట. ఆమాటలఁగూడవిందుమని యాతని దీసికొని పోయెను. లోపలినుండి బ్రాహ్మణుఁడు బైటకు వచ్చునప్పటికి వాని కిరువది గజముల దూరమున సేవకుఁడైన యానందదాసు వచ్చెను. అతడు తనదగ్గఱకు వచ్చినతోడనే బ్రాహ్మణుడు “ఆనందా! విశేషములేమి? బండిసిద్ధముచేసినావా?” యని యడిగెను. అంతట నా నందుఁ డానందము నొంది చిత్తము! సర్వము సిద్ధమైనది. మనశంకరుఁడును బండివాఁడునుగూడ నాయుధపాణులై సిద్ధముగ నున్నారు. మీరు కుఱ్ఱవానిఁ దీసికొని వచ్చుటయే యాలస్యమని చెప్పెను. ఆమాటవిని బ్రాహ్మణుఁడమితానందము నొంది యానందదాసును సంకేత