పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదవ ప్రకరణము

ఆమాఱుమూలసందులో నొకచొట శిథిలమునొంది చూచువారలకు జాలిగలిగించు నొక పురాతన మందిర ముండెను. అది పూర్వము సంపన్నులగు నున్నత వంశజులుగాఁపురముండు గృహమే. కాని, తద్వంశజులు కుమార్తెల వివాహములకయి చేసినఋణముల దీర్పలేక సర్వస్వముఁ గోలుపోయి యిల్లువిడిచి దేశాంతరములకరిగిరి. అప్పటినుండియు నది పాడయి యుండెను. మదనసింగును జిదానందయోగియు నాఁటి రాత్రి యామార్గమున బోవుచు దానికిఁ గొంచెము దూరమున నాలుగుపాడుగోడలను జూచిరి. ఆ గోడలమధ్య నొకచిన్న పెంకుటిల్లుండెను. కాని వీధిలో నుండి నడిచిపోవు వారి కందు గృహమున్నట్లు కనఁబడదు. ఆ యింటి ద్వార మే వైపున నున్నదో యెవ్వరు నెఱుఁగరుగాని గోడకడుగున నున్న పెద్దతూము మనుష్యుడు దూరిపోవునంతటి విశాలముగ నుండుటఁబట్టి గృహమున కరుగు వారందులో నుండిదూఱి లోని కరుగుదురు. దీనింబట్టి యీగృహము మఠాచార్యులకు శరణ్యం బయియుండు నని చెప్పనక్కఱ లేకయే మనమూహింపవచ్చును. ఆగృహసమీపమునకుఁబోయినతోడనే చిదానందయోగి మనకుఁగావలసినది యీయిల్లే ఇక్కడ నిలువుము అని సింగునాపెను. చిదానందయోగి తూములోనుంచి లోనికరిగి, తనకాపద సంభవించు నెడ మదనసింగును లోనికిరమ్మని యాతనిని దూము దగ్గఱ వీధిలో నిలిపెను. అతడు లోపలి కరుగునప్పటి కాయింట నిరువురు పురుషులు మాటలాడు