పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

57

జెప్పినట్లయినదిగదా? యని యడుగగా నైనదనిచెప్పి ఖాను ఫకీరు కోరిక మీఁద నతని కారాత్రి జరిగిన విశేషములన్నియు విన్నవించెను. మఱునాఁటి యుదయమునఁ జక్రవర్తి రహిమానుఖానును దన సన్నిధికి రావించి దండయాత్రను గూర్చి ముచ్చటించుచుండఁగా మఱింత ప్రోత్సాహము కలిగింపఁ దలచి ఖాను దేవరవారికి నేనొక ప్రియము విన్నవించెద. చిత్తూరు రాజ్య సంరక్షకుడగు భీమసింగు మహారాజుభార్య పద్మినియను నొక జగన్మోహనాకార కలదు. ఆమెను బోలు సుందరులు ప్రపంచమున లేరు. మహాచక్రవర్తులైన తమకాసుందరి తగినది. ఈ దండయాత్రవలన రాజస్థానము లోఁబడుటయేగాక పద్మినియు మీకు లభించును. అని విన్నవించినతోడనే యమితానంద భరితుఁడై చక్రవర్తి వజ్రపుటుంగరము ఖానునకు బహుమానము నొసంగి, సాయంకాలపు దర్బారునకు మరల రమ్మని యాతని పంపివైచెను.