పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

33

గలిగియుండినవి. ధనము స్వీకరింపక దీనుల కుచితముగ నౌషధము లిచ్చుటఁ బట్టియు వయోవృద్ధుఁ డగుటం బట్టియు నారాయణసింగునందు జనులకు మిగుల గౌరవము గలదు. వారిరువుర కపకార మొనర్చినవారు ప్రజల కందఱకును విరోధులై యుందురు.

స్వామి కార్యమునం దప్రమత్తుడై నందుఁడు శక్తి వంచన లేక పాటు పడుచు నేవిధమున నైన హేమలతను దన యజమానునకు సమకూర్చవలెనని సకలప్రయత్నములఁ జేయుచు ముందుగ రాధతో స్నేహము చేసెను. ఈ రాధ కిపుడు రమారమి పదునారు సంవత్సరములుండును. దాని తల్లి భర్తను విసర్జించి లేచివచ్చి వ్యభిచార వృత్తి వలన జీవించి రాధ ఎనిమిది సంవత్సరముల వయస్సున్నప్పుడు మృతి నొందెను. అప్పటి నుండియు రాధ బ్రాహ్మణుల యిండ్లఁ బాచి పని జేసి బ్రతుకు చుండెను. అది యిప్పుడు గోవిందశాస్త్రి యను బ్రాహ్మణుని యింట నుండెను. ఆమె యుక్త వయస్కురాలైనవెనుక శాస్త్రి వివాహము చేయఁదలఁచెను. గాని రాధ తనతల్లి వృత్తి యందె ప్రవేశింప నిచ్చ గలదగుటచే శాస్త్రియుఁ దన యుద్యమమును మానుకొనెను. రాధ మిగుల సౌందర్యము గల శూద్రాంగన యగుటచే స్వల్ప కాలమున నామె గ్రామమున నున్న పడుచువాండ్ర కందఱకు బ్రాణ మిత్రురాలై యఱచేతి నిమ్మపండువలె నుండుటయే కాక యొక పర్యాయము ఖాను గారి హృదయమును గూడ నాకర్షించెను. ధనమును నధికారమును గల ఖానుమైత్రి యామె కిష్టమే కాని తనకన్న వస్త్రముల నిచ్చుచున్న హిందువున కాగ్రహము వచ్చునని యామె వెనుక దీయుచుండెను. నందుడు దాసీపుత్రుఁడే కనుక రాధతో సులభముగ స్నేహము జేసి తనస్వామి